ఘట్కేసర్, జనవరి 12 : అధికారం కోసం మోసపూరిత హామీలు ఇచ్చి, ఇప్పుడు అమలుచేయమంటే సమాధానం చెప్పలేక కాంగ్రెస్ ప్రభుత్వం దాడులకు పాల్పడుతున్నదని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని నిరసిస్తూ ఆదివారం చేపట్టిన బంద్‌లో పాల్గొని నిరసన తెలిపేందుకు వెళ్తున్న మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిని ఘట్కేసర్లోని యంనంపేట్ చౌరస్తాలో పోలీసులు అరెస్టుచేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నట్టు ఆరోపించారు.
అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఒక్క గ్యారెంటీని అమలుచేయలేదని విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలుచేయాలని డిమాండ్ చేస్తున్నందుకు తమ కార్యాలయాలపై దాడులకు పాల్పడమేంటని ప్రశ్నించారు. దాడులు చేస్తే ఊరుకునేది లేదని, ఆరు గ్యారెంటీలను అమలుచేసే వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని హెచ్చరించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, బీఆర్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు అమరేందర్, జిల్లా నాయకులు కరుణాకర్‌రెడ్డి, రాజయ్య, రాంరెడ్డి, బద్దూనాయక్, రమేశ్, చింతల కృష్ణ, శివశంకర్ ఉన్నారు.
కాంగ్రెస్ గూండాలకు పోలీస్ వాహనంలో కూర్చోబెట్టి రాచమర్యాదలు చేస్తారా? అని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. కేటీఆర్ ఏసీబీ కార్యాలయం బయట మీడియాతో మాట్లాడితేనే శాంతిభద్రతల కేసు పెట్టిన పోలీసులు.. బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేసిన గూండాలను పోలీస్ వాహనం ముందు సీట్లో కూర్చోబెట్టి సెల్ఫీలు తీసుకునేందుకు అవకాశం ఇస్తారా? అని నిలదీశారు. రాచమర్యాదలతో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో దించుతారా? అని ధ్వజమెత్తారు. ఇదేనా పోలీసుల తీరు? అని రాచకొండ సీపీని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంపై దాడిని నిరసిస్తూ భువనగిరికి బయల్దేరిన పార్టీ నాయకులను ఘట్కేసర్లోని యంనంపేట్ చౌరస్తా వద్ద అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్ తరలించి సాయంత్రం వదిలిపెట్టారు. మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్‌గౌడ్, మేడ్చల్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ఎండీ సిరాజ్, కౌన్సిలర్ బండారి ఆంజనేయులును ముందుస్తు అరెస్టుచేశారు.
హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రజాపాలన పేరుతో విధ్వంస పాలన సాగుతున్నదని, అసమర్థుల ఆఖరి అస్త్రమే హింస అని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి ఎర్రోళ్ల శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రశ్నిస్తే నిర్బంధాలు, అరెస్టులు, దాడులు కొనసాగుతున్నాయని దుయ్యబట్టారు. గత పదేండ్లు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రం కాంగ్రెస్ పుణ్యమా అని విధ్వంసం రాజ్యమేలుతుందని ఆవేదన వ్యక్తంచేశారు.
రాష్ట్రంలో పోలీసుల కనుసన్నల్లో పాలన సాగుతున్నదని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దాడి సందర్భంగా పోలీసులు ప్రదర్శించిన ప్రేక్షకపాత్రే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు.