బల్మూరు, మే 24 : ఉమామహేశ్వర ప్రాజెక్టు తమకు వద్దన్నందుకు రైతులపై పోలీస్ నిర్బంధం కొనసాగింది. శనివారం తెల్లవారుజామునే బల్మూరు, అనంతవరం, మైలారం, అంబగిరి గ్రామాలకు చెందిన 15 మంది భూనిర్వాసితులను అదుపులోకి తీసుకొన్నారు. పోలీస్ వాహనంలో వీరిని నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విషయం తెలియడంతో నాలుగు గ్రామాలకు చెందిన 400మంది రైతులు బల్మూరు మండల కేంద్రానికి చేరుకొని ఆందోళనకు దిగారు. అరెస్టు చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భూములను కోల్పోయే ఉమామహేశ్వర ప్రాజెక్టు తమకు వద్దంటూ నిరసనకు దిగారు. భూములు పోతే తాము ఎలా బతకాలని ఆవేదన చెందారు.
అచ్చంపేట సీఐ రవీందర్, బల్మూరు ఎస్సై రమాదేవి, పోలీసులు రైతుల వద్దకు వెళ్లి నచ్చజెప్పారు. ప్రాజెక్టు నిర్మాణంపై అధికారులు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు రైతులంతా శాంతియుతంగా రావాలని కోరారు. దీనికి వారు నిరాకరించారు. రోడ్డుపై ఆందోళన చేపట్టవద్దంటూ పోలీసులు సూచించడంతో రైతులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమైన సదస్సుకు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ హాజరయ్యారన్న విషయం తెలుసుకొని రైతులు మళ్లీ రోడ్డుపైకి వచ్చారు. మధ్యాహ్నం ఒంటిగంటకు అరెస్టయిన రైతులను పోలీసులు విడుదల చేసి బల్మూరుకు తీసుకొచ్చారు.
గుమిగూడిన రైతలంతా ర్యాలీగా సదస్సు వద్దకు వెళ్లి డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను ఎమ్మెల్యే, ఇరిగేషన్ అధికారులకు అందజేశారు. కుర్చీలు వేసినా రైతులెవరూ వాటిలో కూర్చోలేదు. ఉమామహేశ్వర ప్రాజెక్టును వెంటనే ఆపాలని, రుసూల్, మైలారం చెరువులను ఒక్క టీఎంసీ రిజర్వాయర్‌గా మార్చాలని డిమాండ్ చేశారు. ఎకరాకు పరిహారంగా రూ.30 లక్షలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని సభ దృష్టికి తీసుకొచ్చారు. కానీ సమావేశం ప్రారంభమయ్యాక.. వీరి డిమాండ్లపై స్పందించి చదివి వినిపించకపోవడంతో రైతులు ఆగ్రహం చెందారు. దాదాపు 300 మంది అక్కడి నుంచి అసహనంతో వెళ్లిపోగా.. మిగిలిన కొందరితోనే సమావేశాన్ని కొనసాగించారు.
ఉమామహేశ్వర ప్రాజెక్టుపై నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరులో నిర్వహించిన అవగాహన సదస్సు మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా.. మధ్యాహ్నం ఒంటిగంటకు మొదలైంది. దీంతో అధికారుల తీరుపై రైతులు మండిపడ్డారు. అంతవరకు రైతులెవరూ సదస్సుకు రాకపోవడంతో ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. తర్వాత సదస్సు వద్దకు రైతులు వచ్చినా కుర్చీల్లో కూర్చోలేదు.