SLBC Tunnel | హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): ఎస్ఎల్బీసీ ప్రమాదంలో చిక్కుకున్న వారి కుటుంబసభ్యులు, బంధువులు మీడియాతో సహా ఇతరులు ఎవరితోనూ మాట్లాడకుండా ఉండేందుకు పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు. బాధిత కుటుంబాలను కంట్రోల్ రూం వద్దే ఉంచి ‘తమ కంట్రోల్’లో పెట్టుకున్నారు. ఇందుకు గాను షిఫ్టుల వారీగా వారికి ఇద్దరు పోలీసులు పహారా కాస్తుండటం గమనార్హం.
ఈ క్రమంలో బాధితుల బంధువులతో ‘నమస్తే తెలంగాణ’ మాట్లాడే ప్రయత్నం చేయగా, కంట్రోల్ రూంలోకి వెళ్లకుండా 10 మంది పోలీసులు అడ్డుకున్నారు. తక్షణం ఇక్కడి నుంచి వెళ్లాలంటూ దబాయించారు. ప్రమాదం గురించి వాళ్లు ఏం చెప్తారోనని ఎక్కడికక్కడ కట్టడి చేసినట్టు తోటి కార్మికులు ‘నమస్తే తెలంగాణ’తో చెప్పారు. ప్రమాదం జరిగి వారం అవుతున్నా కనీసం తట్టెడు మట్టి తియ్యలేదని, ఇక్కడ గతంలో పనిచేసిన కార్మికులను మరో ప్రాంతానికి తరలించి అక్కడ కూడా పనులు చేయిస్తున్నారని ఇతర కార్మికులు తెలిపారు.
మరో మూడు రోజుల సమయం పడుతుందని రెస్క్యూ సిబ్బందితో చెప్పారని తెలిపారు. కనీసం మూడు రోజులైనా పడుతుందని, టన్నెల్ నుంచి వచ్చే నీటి ఊట, మట్టిని తొలగించేందుకు సరైన ప్రయత్నం జరగడం లేదని నమస్తే తెలంగాణతో మైన్ రెస్క్యూ సిబ్బంది తెలిపారు. రెస్క్యూ సిబ్బంది, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలు కూడా షిఫ్టుల వారీగా పనులు చేస్తున్నాయని తెలిపారు. కంట్రోల్ రూం పక్కనే ఉన్న మీడియా పాయింట్లో మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతుండగా బాధితుల బంధువులు, పోలీసులు ఆసక్తిగా వినడం గమనార్హం.