హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): జస్టిస్ సిర్పూరర్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సింగిల్ జడ్జి తీర్పు వెలువడే వరకు దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసు విచారణను వాయిదా వేయాలని పోలీసులు హైకోర్టును కోరారు. దీంతో మధ్యంతర పిటిషన్లో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు పిటిషనర్లను ఆదేశించింది.
దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసును సీబీఐకి అప్పగించాలన్న ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావు ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. పోలీసుల తరఫున సీనియర్ న్యాయవాది ఆర్ఎన్ హేమేంద్రనాథ్‌రెడ్డి వాదిస్తూ.. జస్టిస్ సిర్పూరర్ కమిషన్ నివేదికకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లు సింగిల్ జడ్జి పరిశీలనలో ఉన్నాయని, వాటిని సింగిల్ జడ్జి అనుమతిస్తే సిర్పూర్కర్ కమిషన్ నివేదిక ఉనికిలో ఉండదని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో సింగిల్ జడ్జి తీర్పు వచ్చే వరకు దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసును సీబీఐకి అప్పగించాలన్న పిల్‌పై విచారణ వాయిదా వేయాలని కోరారు. దీనిపై కౌంటర్ దాఖలు చేస్తామని పిటిషనర్ల తరఫు న్యాయవాది వసుధానాగరాజ్ తెలియజేయడంతో.. తదుపరి విచారణను దసరా సెలవుల తర్వాత చేపడతామని హైకోర్టు ప్రకటించింది.