హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చడంలో ప్రభుత్వ యంత్రాం గం నిర్లక్ష్య ధోరణితో అంతర్గత, రాష్ట్ర, జాతీయ రహదారులపై తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా చెవెళ్ల సమీపంలోని మిర్జాగూడ (Chevella Bus Accident) వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణం రహదారిపై గుంతేనని పోలీసులు, స్థానికులు చెప్తున్నారు. కంకర ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ లారీ.. గుంతను తప్పించబోయి.
ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగిందని, బస్సు కూడా ఓవర్‌లోడ్‌తో ఉండటంతో భారీ ప్రాణనష్టం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వరుస ప్రమాదాల నేపథ్యంలో రోడ్డు విస్తరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కా దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతు చేయకపోవడంతోనే ఇప్పుడు భారీ ప్రాణనష్టం జరిగిందని స్థానికులు వాపోతున్నారు. రోడ్డుపై తరుచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను అధికారులు బ్లాక్స్పాట్లుగా నిర్ధారించారు. కానీ ఆయా ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవడంలేదు. ఫలితంగానే వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెప్తున్నారు.
ఔటర్ రింగ్ రోడ్డు లోపలి రోడ్లపై గుంతలతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. వాహనదారులు వెన్నునొప్పులతో దవాఖాన పాలవుతున్నారు. డివైడర్ లేని రోడ్లపై పరిస్థితి మరీ దారుణంగా ఉంటున్నది. హైదరాబాద్, బీజాపూర్ రహదారిపై తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇష్టానుసారంగా ఓవర్‌లోడ్‌తో వాహనాలు రాత్రి వేళల్లో ప్రయాణాలు సాగిస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పటాన్చెరు నుంచి వికారాబాద్‌కు 58 టన్నుల కంకరతో వెళ్తున్న టిప్పర్‌ను మార్గమధ్యలో ఎవరూ తనిఖీ చేయలేదంటే అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్తున్నారు.