Congress Govt | 8 నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ఎటుచూసినా పోలీసుల వలయమే కనిపించింది. ప్రశ్నించే గొంతుకలపై అడుగడుగునా పోలీసుల ఉక్కుపాదమే దర్శనమిచ్చింది. డిమాండ్లు పరిష్కరించాలని, హామీలు నెరవేర్చాలంటూ రోడ్డెక్కిన ప్రతివర్గాన్ని, సమూహాన్ని ఎక్కడికక్కడ నిర్భందించిన పోలీసులు వాళ్లను స్టేషన్లకు తరలించారు. నిరసనకారుల డిమాండ్లను మాత్రం ప్రభుత్వం ఇప్పటికీ పరిష్కరించలేదు.
02.08.2024 జాబ్ క్యాలెండర్ పేరిట ఊరించి.. చివరకు పోలీసుల వివరాల్లేని క్యాలెండర్‌ను ప్రకటించి నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. సర్కారు వైఖరిని నిరసిస్తూ గన్‌పార్క్ వద్ద నిరసన తెలియజేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను పోలీసులు ఎత్తుకెళ్లి వాహనాల్లోకి ఎక్కించారు.
01.08.2024 కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలంటూ కోఠిలోని ఎన్హెచ్ఎం కార్యాలయం ముందు ధర్నా చేసిన టీజీ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ మహిళా నేతలను మహిళా పోలీసులు లాక్కెళ్లారు. ఇప్పటికీ వారి డిమాండ్ పరిష్కారం కాలేదు.
15.06.2024 జీతాల పెంపును వెంటనే చేపట్టాలంటూ కోఠిలోని డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద నిరసనకు దిగిన ఆశ వర్కర్లను గేటుబయటే అడ్డుకొన్న పోలీసులు.. వారిపై ప్రతాపాన్ని చూపారు. ఆశల డిమాండ్లను ప్రభుత్వం ఇంకా పట్టించుకోలేదు.
15.07.2024 విద్యార్థుల ఫీ-రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలని నిరసన బాటపట్టిన ఏఐఎస్ఎఫ్ నేతలపై పోలీసులు దౌర్జన్యం ప్రదర్శించారు. వారి డిమాండ్లను మాత్రం ప్రభుత్వం పెడచెవిన పెట్టింది.
24.01.2024 వ్యవసాయ వర్సిటీ భూముల ను హైకోర్టు నిర్మాణాలకు ఇవ్వడాన్ని విద్యార్థులు నిరసించారు. అలా ఆందోళన చేసిన ఓ విద్యార్థి నిపై పోలీసులు కర్కశత్వం ప్రదర్శించారు. భూములపై మాత్రం సర్కారు వెనక్కి తగ్గలేదు.
23.06.2024 నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా కరీంనగర్లో నిరసన ప్రదర్శనలు చేసిన విద్యార్థి నాయకులపై పోలీసులు దమనకాండ ప్రదర్శించారు.
29.07.2024 డిమాండ్ల సాధనకు‘చలో హైదరాబాద్’ కార్యక్రమానికి సిద్ధమైన నిజామాబాద్‌కి చెందిన పంచాయతీ కార్మిక సంఘం మండల అధ్యక్షురాలు రాజేశ్వరికి గ్రామం దాటొద్దని పోలీసులు అర్ధరాత్రి నోటీసులు ఇచ్చారు.
18.06.2024 నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా రాజ్‌భవన్ ముట్టడికి ప్రయత్నించిన బీఆర్ఎస్వీ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు ఈడ్చేశారు.
15.07.2024 జాబ్‌క్యాలెండర్‌ను ప్రకటించాలని, విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సచివాలయం ముట్టడికి వెళ్తున్న బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాంయాదవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, వారి డిమాండ్లను మాత్రం పరిష్కరించలేదు.
11.07.2024 డీఎస్సీ వాయిదా వేయాలని, గ్రూప్స్ పోస్టులు పెంచాలంటూ నిరసనబాటపట్టిన ఓయూ విద్యార్థిపై పోలీసులు పిడిగుద్దుల వర్షం కురిపించారు. డిమాండ్లు మాత్రం పరిష్కరించలేదు.
30.07.2024 ఇస్తామన్న హామీమేరకు ఉద్యోగాల క్రమబద్ధీకరణ చేయాలంటూ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన సమగ్రశిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులపై పోలీసులు దౌర్జన్యం ప్రదర్శించారు. ఉద్యోగుల వినతిని సర్కారు పెడచెవినపెట్టింది.
31.07.2024 సెంట్రలైజ్డ్ కిచెన్ విధానానికి వ్యతిరేకంగా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన మిడ్డే మీల్ వర్కర్స్‌పై పోలీసులు జులుం ప్రదర్శించారు. అయితే, వారి విజ్ఞప్తిని మాత్రం ప్రభుత్వం పట్టించుకోలేదు.
31.07.2024 ఫ్రీ బస్సుతో జీవనోపాధి కోల్పోయిన ఆటోవాలాలను ఆదుకోవాలంటూ ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు ఆటోలో వెళ్తున్న ఏఐటీయూసీ నేతలను పోలీసులు వెంటాడి మరీ అరెస్టు చేశారు. అధికారంలోకి వచ్చి 8 నెలలైనా ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం ఇంకా పట్టించుకోలేదు.
26.06.2024 పెండింగ్ పోస్టుల భర్తీని వెంటనే చేపట్టాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించిన గురుకుల అభ్యర్థులను రోడ్డుమీదే పోలీసులు నిర్బంధించారు. వారి విజ్ఞప్తిని సర్కారు పట్టించుకోలేదు.
02.08.2024 పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ సచివాలయం ఎదుట ధర్నాకు బయల్దేరిన మాజీ సర్పంచ్‌లను అదుపులోకి తీసుకొన్న పోలీసులు తిరుమలగిరి స్టేషన్‌కు తరలించారు. బిల్లులు మాత్రం చెల్లించలేదు.
05.07.2024 జాబ్ క్యాలెండర్‌ను వెంటనే ప్రకటించాలని, డీఎస్సీని వాయిదా వేసి పోస్టులు పెంచాలని టీజీపీఎస్సీ ముట్టడికి వెళ్లిన బీఆర్ఎస్వీ నేతలను పోలీసులు ఈడ్చేశారు. అయితే ఖాళీలసంఖ్య లేకుండా జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించిన సర్కారు.. డీఎస్సీ వాయిదా డిమాండ్‌ను పట్టించుకోలేదు.
02.08.2024 జీవో 46 రద్దు కోసం ప్రజాభవన్ వద్ద ఆందోళనకు దిగిన కానిస్టేబుల్ అభ్యర్థులను పోలీసులు అడ్డుకొన్నారు. దీంతో అక్కడే ఫుట్‌పాత్‌పై నిద్రపోతూ అభ్యర్థులు నిరసన తెలియజేశారు. దీనిపై సర్కారు ఏమాత్రం స్పందించలేదు.