హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ) : సంతాన సాఫల్యత పేరిట ఏపీ, తెలంగాణ సహా మొత్తం 8 రాష్ర్టాల్లో అక్రమాలకు పాల్పడిన డాక్టర్ అట్లూరి నమ్రతతోపాటు ఆమె నడుపుతున్న ‘సృష్టి ఫెర్టిలిటీ’ కేంద్రాలపై లోతైన దర్యాప్తు జరిపేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. ‘సృష్టి’ అక్రమాల వెనుక భారీగా నగదు చేతులు మారినట్టు గుర్తించిన ఈడీ అధికారులు.. ఆ నిధులను ఎక్కడికి తరలించారు? ఏమి చేశారన్న దానిపై విచారణ చేపట్టేందుకు సిద్ధమయ్యారు. కేసు వివరాలను అందజేసేందుకు రాష్ట్ర పోలీస్ విభాగం కూడా అంగీకరించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత, ఆమె భర్త సురేశ్, చెల్లెలు కీర్తి, ఇతర సిబ్బంది ఈ అక్రమాలకు పాల్పడినట్టు తెలంగాణ పోలీసులు తేల్చారు. ఈ కేసులో డాక్టర్ నమ్ర త సహా ఇప్పటివరకు 30 మందికి పైగా అరెస్టు చేశారు. రూ.40 కోట్ల వరకు మనీలాండరింగ్ జరిగినట్టు ఈడీ అనుమానిస్తున్నది. ‘సృష్టి’ అక్రమాలు వెలుగులోకి రాగానే మంత్రి దా మోదర స్పందిస్తూ.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించి చేతు లు దులిపేసుకున్నారు. ఇప్పటికైనా ఈ కేసుపై సీఐడీ దర్యాప్తు జరిపించాలని, నిం దితులను శిక్షించాలని బాధితులు కోరుతున్నారు. ఈ వ్యవహారంపై మానవ హకు ల కమిషన్ సైతం సీరియస్గా స్పందించింది. సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.