హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): ఏపీ ప్రభుత్వం (Andhra Pradesh) మరో కొత్త ప్రతిపాదనకు తెరతీసింది. పోలవరం-సోమశిల లింక్‌ను చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. అందులో భాగంగా పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు (Polavaram-Banakacharla link project) టెండర్లను రద్దు చేసింది. ఏపీ పునర్విభజన చట్టంలోని నిబంధనలన్నీ తుంగలో తొక్కుతూ ఏపీ ప్రభుత్వం పోలవరం- బనకచర్ల లింక్ ప్రాజెక్టును చేపట్టేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. వరద జలాల మాటున 200 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్ నుంచి బనకచర్ల మీదుగా పెన్నా బేసిన్‌కు మళ్లించే ప్రతిపాదనలతో రూ.80,112 కోట్లతో లింక్ ప్రాజెక్టుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
నిధుల సమీకరణకు జలహారతి పేరిట కార్పొరేషన్‌ను కూడా ఏర్పాటుచేసింది. అయితే ఏపీ సమర్పించిన ప్రాజెక్టు ప్రీ ఫీజిబిలిటీ స్టడీస్ రిపోర్ట్‌ను అధ్యయనం చేసిన కేంద్ర సంస్థలు సీడబ్ల్యూసీ, ఎన్‌డబ్ల్యూడీఏ, గోదావరి, కృష్ణా రివర్ బోర్డులు, పోలవరం ప్రాజెక్టు అథారిటీతోపాటు, కో బేసిన్ రాష్ర్టాలైన తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా సైతం తీవ్రంగా ఆక్షేపించాయి. ప్రాజెక్టును అనుమతించవద్దని ఖరాకండిగా తేల్చిచెప్పాయి. అయినా ఏపీ సర్కారు వెనకడుగు వేయలేదు. కానీ ఊహించని విధంగా అందుకు సంబంధించిన టెండర్లను రద్దు చేసుకున్నది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించింది.
జీసీలో భాగమైన సోమశిల లింక్కే మొగ్గు..!
ఏపీ హఠాత్తుగా పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టును రద్దు చేయడం వెనక మతలబు వేరే ఉన్నట్టు తెలుస్తున్నది. పోలవరం నుంచి సోమశిలకు లింక్ ప్రాజెక్టు చేపట్టేందుకు మొగ్గు చూపుతున్నదని విశ్వసనీయ సమాచారం. తద్వారా కేంద్ర ప్రభుత్వం ఆశించిన గోదావరి-కావేరి లింక్ సైతం సాకారమవుతుందని, కేంద్రమే నిధులను భరిస్తుందని తెలిసింది. కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధాన కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు సాగుతున్నది. అందులో గోదావరి- కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టు కూడా ఒకటి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం తన వాటా 148 టీఎంసీలను వినియోగించుకోవడం లేదని, ఆ మేరకు జలాలను కావేరీకి తరలిస్తామని చెప్తున్నది. అందులో భాగంగా గోదావరి నదిపై తొలుత ఇచ్చంపల్లి వద్ద కొత్తగా 87 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ (ఫుల్ రిజర్వాయర్ లెవల్)తో బరాజ్‌ను నిర్మించాలి. అక్కడి నుంచి 355 కిలోమీటర్ల కాలువను నిర్మించి సాగర్‌కు తరలించి, ఆపై సోమశిలకు, అక్కడి నుంచి కావేరీకి మళ్లించాలనేది ప్రతిపాదన.
దశాబ్దాలుగా ఇది కాగితాలకే పరిమితమైంది. ఇచ్చంపల్లి బరాజ్ నిర్మాణాన్ని తెలంగాణ వ్యతిరేకించింది. దీంతో సమక్క సాగర్ బరాజ్ నుంచి జీసీ లింక్ చేపట్టాలనే మరో ప్రతిపాదన ముందుకు వచ్చింది. మరోవైపు రాష్ర్టాల అభ్యంతరాలు, నీటివాటాలను డిమాండ్ చేస్తున్నాయి. ఇక ఏపీ సైతం లింక్‌ను పోలవరం నుంచే చేపట్టాలని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నది. ప్రతీసారి ప్రతిపాదనలు పెడుతున్నది. అయితే దీనికి ఎన్‌డబ్ల్యూడీఏ ససేమిరా అంటున్నది. కానీ ప్రస్తుతం పోలవరం నుంచే గోదావరి జలాలను సోమశిలకు తరలించేందుకు ఏపీ సిద్ధమైనట్టు తెలుస్తున్నది. తద్వారా ఏపీకి లబ్ధి పొందడంతోపాటు, కావేరికి మళ్లించే అవకాశముంటుందని తెలుస్తున్నది. పోలవరం సోమశిల లింక్ ద్వారా జీసీ లింక్ లక్ష్యాలను కూడా సాధించేందుకు లోపాయికారీగా కుట్రలకు తెరలేపిందని ఇరిగేషన్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతున్నది. అందులో భాగంగానే ఏపీ బనకచర్ల టెండర్లను రద్దుచేసిందని విశ్వసనీయ సమాచారం. ఏపీ, కేంద్ర ప్రభుత్వాల రెండింటి లక్ష్యం గోదావరి జలాల మళ్లింపేనని, ఆ దిశగా ఉమ్మడిగానే అడుగులు వేస్తున్నాయని, అందులో భాగంగా తెలంగాణపై కొత్త కుట్రలకు తెరలేపినట్టు స్పష్టమవుతున్నది.