రవీంద్రభారతి, సెప్టెంబర్ 9: కర్ణాటకలో పుట్టి తెలంగాణ గడ్డపై ఎదిగిన కాళోజీ నారాయణరావు తెలంగాణ నేలను అత్యంత అభిమానించారని సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. పొరుగువాడు తెలంగాణకు ద్రోహం చేస్తే పొలిమేర దాక తరిమికొడతామని, మనవాడే ద్రోహం చేస్తే ఇక్కడే పాతరేస్తామన్నా కాళోజీ తెలంగాణ కీర్తి పతాక అని కొనియాడారు. కాళోజీ 109వ జయంతి వేడుకలు తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్, విశిష్ఠ అతిథిగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ హాజరై, కాళోజీకి నివాళులర్పించారు. అనంతరం కవి జయరాజ్‌కు కాళోజీ నారాయణరావు అవార్డుతోపాటు లక్ష నూట పదహారు రూపాయల చెక్కును అందించి ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మహనీయుల జయంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. కాళోజీ నారాయణరావు పేరుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అవార్డుకు కవి జయరాజ్‌ను ఎంపిక చేయడం అనందంగా ఉన్నదని తెలిపారు. జయరాజ్ సాహిత్యరంగానికి అందించిన సేవలను కొనియాడారు. ఆత్మగౌరవంతో ఏర్పడిన తెలంగాణ కన్నీళ్లు, బాధలు లేకుండా ముందుకు సాగుతున్నదని, జయరాజ్ లాంటి కవులు రాష్ట్ర ప్రగతిపై కవితలు రాసి ప్రజలను చైతన్యం చేయాలని కోరారు. అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ.. సమాజ హితం కోసం నిరంతరం కృషి చేసి కాళోజీ నారాయణరావు చరిత్రలో నిలిచిపోయారని అన్నారు.
వైద్య విశ్వవిద్యాలయానికి కాళోజీ పేరుపెట్టి సీఎం కేసీఆర్ ఆయనను గౌరవించారని గుర్తుచేశారు. త్వరలో వరంగల్‌లో కాళోజీ నారాయణరావు పేరిట విజ్ఞాన కేంద్రం ప్రారంభం కానున్నుట్టు తెలిపారు. కార్యక్రమంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు డాక్టర్ కేవీ రమణాచారి, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ దీపికారెడ్డి, గ్రంథాలయ పరిషత్ చైర్మన్ అయాచితం శ్రీధర్, అధికార భాషా సంఘం అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి, పర్యాటక శాఖ శాఖ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్‌యాదవ్, హైదరాబాద్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గడ్డం శ్రీనివాస్‌యాదవ్, భాషాసాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, కవులు, కళాకారులు పాల్గొన్నారు.
తెలంగాణ భాషకు ఊపిరిపోసిన కాళోజీ
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): ప్రజాకవి కాళోజీ నారాయణరావు తెలంగాణ ప్రజల యాస, బాషకు ఊపిరిపోశారని మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. కాళోజీ జయంతి సందర్భంగా శనివారం ఆయన ట్వీట్ చేశారు. ‘ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు.
తెలంగాణ ప్రజల యాస, భాషకు ఊపిరి పోసి స్వరాష్ట్ర కాంక్షను రగిలించి, ఉద్యమానికి ఊపిరిలూదారు. పుట్టుక నీది, చావు నీది, బతుకంతా తెలంగాణది’ అని మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్లో పేర్కొన్నారు.