బాన్సువాడ, జనవరి 5: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన నలుగురు ఉపాధ్యాయులపై అధికారులు సస్పెన్షన్ వేటు వేయగా.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు స్థానిక ఎస్సై శివకుమార్ తెలిపారు. ఆదివారం నలుగురు ఉపాధ్యాయులను అరెస్టు చేసిన రిమాండ్కు తరలించినట్టు పేర్కొన్నారు.
విద్యాలయంలో కొంతకాలంగా విద్యార్థినులతో కొందరు ఉపాధ్యాయులు అసభ్యకరంగా ప్రవరిస్తూ, లైంగిక వేధింపులకు పాల్పడుతుండడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఆ ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నలుగురు ఉపాధ్యాయులపై పోక్సో కేసు నమోదు చేయడంతోపాటు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇదే కేసులో అధికారులు ఓ ఉపాధ్యాయుడిని వారం రోజుల క్రితం కర్ణాటకకు బదిలీ చేశారు.