సంగారెడ్డి, మార్చి 29 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ నుంచి చెత్త సరుకుపోతున్నదని, గట్టి సరుకైన కార్యకర్తలు కేసీఆర్ వెన్నంటే ఉన్నారని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పదవులు, వ్యాపారాలు, కాంట్రాక్టుల కోసం బీఆర్ఎస్లోని కొంతమంది నేతలు పార్టీ వీడుతున్నారని దుయ్యబట్టారు. పార్టీ వీడుతున్నవారి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెజార్టీ సీట్లు గెలిస్తే రాజకీయ మార్పు జరగడం తథ్యమని అన్నారు. ఎంపీ ఎన్నికల తర్వాత బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవుతాయని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్‌కు ప్రజలు ఎంపీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. మత రాజకీయాలు చేస్తున్న బీజేపీకి ప్రజలను ఓటు అడిగే హక్కులేదని అన్నారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అధ్యక్షతన బీఆర్ఎస్ జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహాక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు నెరవేర్చాలంటే ఏటా రూ.3 లక్షల కోట్లు అవసరం అవుతాయని తెలిపారు.
అన్ని నిధులు కాంగ్రెస్ ప్రభుత్వం వద్దలేవని అన్నారు. వంద రోజుల్లో 13 హామీలు నెరవేర్చాల్సి ఉండగా అవీ నెరవేర్చలేదని విమర్శించారు. ఆరు గ్యారెంటీలు అమలు చేశామని గొప్పలు చెబుతున్న రేవంత్ సర్కార్ ఇప్పటివరకు ప్రభుత్వ ఖజానా నుంచి గ్యారెంటీల అమలుకు రూపాయి కూడా విడుదల చేయలేదని విమర్శించారు. రైతులు, ప్రజలు, పేదలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆరోపించారు. రేవంత్ సర్కారు తీరు ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థం అవుతుందని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ పాలనపట్ల ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. ఇదివరకు జహీరాబాద్ పార్లమెంట్ నుంచి గెలిచిన సురేశ్ షెట్కార్, బీబీ పాటిల్ ఇద్దరూ నియోజక వర్గానికి చేసిందేమీ లేదన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌ను గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధి చేస్తారని తెలిపారు. ఎంపీ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్ మాట్లాడుతూ తనను ఎంపీగా గెలిపిస్తే జహీరాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయటంతోపాటు కొత్త రైల్వేలైన్, పరిశ్రమలు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. అందోలు మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ మాట్లాడుతూ మాటతప్పిన కాంగ్రెస్‌కు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కర్రుకాల్చివాతపెట్టడం ఖాయమన్నారు. సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు జైపాల్‌రెడ్డి, సాయికుమార్, మీనాక్షి, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ కుప్పకూలటం ఖాయం
పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు భిన్నమైన తీర్పు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కుప్పకూలటం ఖాయమని పోచారం జోస్యం చెప్పారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ తెలంగాణ అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఈడీ, సీబీఐ ఇతర కేంద్ర సంస్థలను అడ్డుపెట్టుకుని బీజేపేతర పార్టీ నాయకులను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. మతరాజకీయాలు చేస్తున్న బీజేపీకి ఎంపీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ఓటర్లను కోరారు.