బాన్సువాడ, అక్టోబర్ 23: సుదీర్ఘ రాజకీయ జీవితం… మంత్రిగా, శాసన సభాపతిగా అనుభవం.. ఏడు దశాబ్దాల వయస్సు గల పెద్దరికం గల బాన్సువాడ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీస్తున్నాయి. బీఆర్ఎస్లో గెలిచి.. కాంగ్రెస్ గూటికి చేరిన ఆయన.. తాను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నట్టు చెప్పుకొచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా.. మీడియా ముఖంగా కాంగ్రెస్ కండువా కప్పుకున్న పోచారం… న్యాయస్థానంలో, స్పీకర్ పరిధిలో ఫిరాయింపు కేసు విచారణ ఎదుర్కొంటున్నారు. కానీ నియోజకవర్గ ఓటర్లను, రాష్ట్ర ప్రజలను బుకాయించే ప్రయత్నం చేశారు. స్పీకర్ అడిగినప్పుడు కూడా తాను బీఆర్ఎస్లోనే ఉన్నట్టు చెప్పానని తెలిపారు.
స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని చెప్పారు. గురువారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని తన నివాసంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి కోసం అడిగినన్ని నిధులను బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ఇచ్చారని గుర్తుచేసుకున్నారు.
కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఎదురైన అనుభవాలను తల్చుకుని, పార్టీ మారడానికి దారితీసిన కారణాలను చెప్పుకున్నారు. ‘ఎస్డీఎఫ్తోపాటు ఇతరత్రా కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగాలని, ఫలితాలు ప్రజలకు అందాలని సదుద్దేశంతో రకరకాల సమస్యలను దృష్ట్టిలో ఉంచుకుని, ఆయా విషయాలన్నీ సీఎంతోనే పరిష్కారమవుతాయి కాబట్టి, ఆయన(రేవంత్‌రెడ్డి) సహకరిస్తానని అంటేనే.. సరే అని వెళ్లాను’ అని తెలిపారు.
‘పనులు చేసిన కార్యకర్తల బాధలు చూసి, టెన్షన్ పడలేక నిద్రలేని రాత్రులెన్నో చూశాను. నేను బాన్సువాడకు రాగానే ఎస్డీఎఫ్ నిధులు ఏమయ్యాయని కార్యకర్తలు ఒకటికి నాలుగుసార్లు అడిగితే ఏమని సమాధానం చెప్పాలి? బాకీ తెచ్చుకుని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకున్నామని, బిల్లులు ఇవ్వాలని ఆడబిడ్డలు అడిగితే నరకయాతన చూశాను’ అంటూ చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్కు దూరమై, ఆ పార్టీ కార్యక్రమాలకు హాజరు కాకుండా, కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న పోచారం.. బీఆర్ఎస్లోనే ఉన్నట్టు చెప్పుకోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పోచారం రాజకీయ విలువలకు తిలోదకాలు ఇచ్చారని నెటిజన్లు విమర్శిస్తున్నారు.