హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మీదుగా వివిధ రాష్ర్టాలను కలిపే ఐదు జాతీయ రహదారుల నిర్మాణ పనులకు ఈ నెల 8న ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ మైదానం నుంచి ప్రధాని ఈ ప్రాజెక్టులకు లాంఛనంగా శంకుస్థాపన చేస్తారు. సుమారు 411 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్న ఈ ఐదు జాతీయ రహదారుల నిర్మాణ వ్యయం రూ.7,865 కోట్లు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రను కలుపుతూ వీటిని నిర్మిస్తున్నారు.
ప్రధాని పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు: సీఎస్ శాంతికుమారి
హైదరాబాద్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ఈ నెల 8న ప్రధాని పర్యటనను పురస్కరించుకొని మంగళవారం బీఆర్కేఆర్ భవన్లో సీఎస్ అధ్యక్షతన సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్నిశాఖలు సమన్వయంతో పనిచేసి ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. పోలీసు శాఖ బ్లూబుక్ ప్రకారం తగిన భద్రత, శాంతిభద్రతలు, ట్రాఫిక్, బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. తగినన్ని అగ్నిమాపక వాహనాలు, పరికరాలు, యంత్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వైద్య సిబ్బంది, అంబులెన్స్, ఇతర సౌకర్యాలను సిద్ధంగా ఉంచాలని కోరారు. ప్రధాని కాన్వాయ్ ప్రయాణించే రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరారు. అన్ని వేదికల వద్ద అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీజీపీ అంజనీకుమార్, పోలీసు, రైల్వే సహా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.