శంకుస్థాపనకే ఏడాదిన్నర.. పనులెప్పుడో!
ఏనాడూ తెలంగాణను పట్టించుకోని వ్యక్తి.. ఎన్నిసార్లు చేతులెత్తి ప్రార్థించినా పైసా ఇవ్వని వ్యక్తి ఇప్పుడు పనిగట్టుకొని తెలంగాణకు వస్తున్నారు. ఇంకేముంది ఆయన వందిమాగధులు తప్పెట్లు, తాళాలు మోగిస్తూ, బాకాలు ఊదుతూ ఊగిపోతున్నారు.
- అధ్వానంగా రాష్ట్రంలోని జాతీయ రహదారులు
- కొత్త రోడ్లు వేయరు.. ఉన్నవాటిని బాగుచేయరు
- నేడు రెండు రోడ్ల నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన
- బీజేపీ హడావిడిపై తెలంగాణవాదుల మండిపాటు
నమస్తే తెలంగాణ నెట్వర్క్, నవంబర్ 11: ఏనాడూ తెలంగాణను పట్టించుకోని వ్యక్తి.. ఎన్నిసార్లు చేతులెత్తి ప్రార్థించినా పైసా ఇవ్వని వ్యక్తి ఇప్పుడు పనిగట్టుకొని తెలంగాణకు వస్తున్నారు. ఇంకేముంది ఆయన వందిమాగధులు తప్పెట్లు, తాళాలు మోగిస్తూ, బాకాలు ఊదుతూ ఊగిపోతున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో బీజేపీ నేతలు రాష్ర్టానికి ఏదో కిరీటం పెట్టబోతున్నంత బిల్డప్ ఇస్తున్నారు. ముఖ్యంగా జాతీయ రహదారుల శంకుస్థాపన విషయంలో అలవాటు ప్రకారం అడ్డమైన అబద్ధాలు చెప్తున్నారు. మెదక్-సిద్దిపేట-ఎల్కతుర్తి మధ్య నిర్మించనున్న 765 నంబర్ జాతీయ రహదారి, ఎన్‌హెచ్ 161పై బోధన-బాసర-భైంసా రహదారి విస్తరణ పనులకు ప్రధాని మోదీ శనివారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని చూపించి రాష్ట్ర బీజేపీ నేతలు ఆహా ఓహో అని సంబురాలు చేసుకొంటున్నారు.
ఇంత జాప్యం ఎందుకు?
విస్తరణ కోసం ఈ రహదారులను కేంద్రం 2021, మార్చి 23న స్వాధీనం చేసుకొన్నది. ఇప్పటికి ఏడాదిన్నర గడిచిపోయింది. రోడ్డు ఎప్పుడు వెడల్పు చేస్తారా! అని ప్రజలు ఎంత ఎదురుచూసినా ప్రధానికి తీరుబాటే కాలేదు. ఇన్నాళ్లకు శంకుస్థాపనకు వస్తున్నారు. శంకుస్థాపన చేయటానికే ఏడాదిన్నర సమయం పడితే.. ఇక ఆ రోడ్లు వేయటానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందోనని ఆ ప్రాంతవాసులు వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి మోదీ ప్రధాని అయిన తర్వాత తెలంగాణలో జాతీయ రహదారులు డొంకదారుల్లాగా తయారయ్యాయి. మరమ్మత్తులకు నిధులివ్వకపోవటం, కొత్త రోడ్లు మంజూరు చేయకపోవటంతో అనేక చోట్ల జాతీయ రహదారులు నడిచివెళ్లేందుకు కూడా పనికిరాకుండా తయారయ్యాయి. ముఖ్యంగా మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఎన్‌హెచ్‌ల కోసం పైసా ఇవ్వలేదు. ఇప్పుడు.. ఇన్నాళ్లకు రెండుచోట్ల రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేయటానికి వస్తున్నారు.
ఇదీ ఎన్‌హెచ్‌ల దుస్థితి..
- రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జాతీయ రహదారులు నామరూపాలు కోల్పోయాయి. ఇక కొత్తవాటి ఊసే లేదు. కొన్ని మార్గాల్లో జాతీయ రహదారుల కోసం దశాబ్దాలుగా డిమాండ్‌చేస్తున్నా కేంద్రం పట్టించుకోవటంలేదు. మంజూరుచేసిన ఒకటిరెండు రహదారుల నిర్మాణం నత్తనడకన సాగుతున్నది.
- జాతీయ రహదారి జంక్షన్ 353 సీ నుంచి భూపాలపల్లి-అంశాన్పల్లి-గొర్లవీడు, నేరేడ్‌పల్లి-గర్మిళ్లపల్లి-బూరపల్లి-ఎంపేడ్-వావిలాల-జమ్మికుంట-వీణవంక-కరీంనగర్ వరకు 131 కిలోమీటర్ల జాతీయ రహదారికి సూత్రప్రాయంగా అంగీకరించి 2, 4, 6 లేన్స్ అప్‌గ్రేడ్ చేస్తామని 2017 ఆగస్టు 31న కేంద్రం ప్రకటించింది. నేటికీ ప్రకటనలకు మాత్రమే పరిమితమైంది.
- సిరిసిల్ల-సిద్దిపేట-దుద్దెడ రాష్ట్ర రహదారిని జాతీయ రహదారి నంబర్ 365బీ గా ప్రకటిస్తూ 2016 ఫిబ్రవరి 16న కేంద్రం గుర్తించింది. డీపీఆర్ సిద్ధం చేయనున్నట్టు తెలిపింది. నేటికీ అతీ గతీలేదు.
- జగిత్యాల-కరీంనగర్-కామారెడ్డి-పిట్లం జాతీయ రహదారి అలాగే, కోరుట్ల- వేములవాడ- సిరిసిల్ల- సిద్దిపేట- జనగామ- సూర్యాపేట, కరీంనగర్-వీణవంక-జమ్మికుంట-చిట్యాల్-భూపాలపల్లి- మహదేవ్పూర్-సిరోంచ జాతీయ రహదారి కోసం ప్రజలు కోరుతున్నా.. నేటికీ స్పందన లేదు.
- ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నాలుగు జాతీయ రహదారుల పనుల పర్యవేక్షణ కోసం 2016 జూన్ 24న ఎస్ఈ కార్యాలయాన్ని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ ఏర్పాటు చేయించారు. నేడు పనులు లేక కార్యాలయంలోని అధికారులు వెళ్లిపోయే దుస్థితి నెలకొన్నది.
- ఎన్హెచ్ఏఐ నంబర్ 563 కరీంనగర్- వరంగల్ జాతీయ రహదారి మరమ్మతు కు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ప్రతిపాదనలు పంపినా కేంద్రం మొండిచేయి చూపడంతో.. వినోద్‌కుమార్ సీఎం కేసీఆర్‌తో మాట్లాడి గతేడాది రాష్ట్ర ప్రభుత్వం నుంచి కోటి రూపాయలు ఇప్పించి మరమ్మతులు చేశారు.
- భారత్‌మాల జాబితాలోకి కరీంనగర్- వేములవాడ-సిరిసిల్ల-పిట్లం రోడ్డును చే ర్చి జాతీయ రహదారిగా మారుస్తామని కేంద్రం గత ఏడాది హామీ ఇచ్చింది. కరీంనగర్-చల్లూరు-టేకుమట్ల-భూపాలపల్లి రోడ్డును జాతీయ రహదారిగా ప్రకటించడానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. కానీ, ఇప్పటికీ అతీగతీ లేదు.
- భద్రాద్రి జిల్లాలోని రుద్రంపూర్ నుంచి పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, బూర్గంపాడు మీదుగా 50 కిలోమీటర్ల పొడవునా ఎన్‌హెచ్ 30 జాతీయ రహదారి పనులు నత్తనడకన సాగుతున్నాయి. నిధులు మంజూరై ఏడేండ్లయినా పనుల విషయంలో తీవ్ర జాప్యం జరుగుతున్నది.
- నిజామాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్ వరకు ఉన్న 63వ జాతీయ రహదారి విస్తరణకు కేంద్రం నిధులు మంజూరు చేసింది. నిజామాబాద్ శివారు నుంచి ఆర్మూర్ వరకు 19 కిలో మీటర్ల మేర రహదారి విస్తరణకు నిధులు మంజూరు చేశారు. 14.377 కిలోమీటర్ వరకు రహదారి విస్తరణ పూర్తి చేసి, మరో 4.633 కిలోమీటర్ల మేర పనులు నిలిపేశారు. దీంతో ఆ మార్గంలో వెళ్లేవారు నానా కష్టాలు పడుతున్నారు.
- సంగారెడ్డి జిల్లాలో 161 నాందేడ్-అకోలా రహదారి నిర్మాణం పనులు ఇంకా పూర్తి కాలేదు. దీంతో ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు పోతున్నాయి.
- మానుకోట జిల్లా మీదుగా వెళ్ళే ఎన్‌హెచ్-365 ఏకు ఇంకా టెండర్లు కూడా పిలువలేదు.
- 63 రోడ్డుపై రాంపూర్-చింతగట్టు క్యాంపు-ఆరెపల్లి వద్ద అండర్‌పాస్ అస్తవ్యస్తంగా మారింది. హైవే నుంచి కిందకి దిగి స్థానిక రోడ్లపైకి వాహనాలు రావాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
- కేంద్ర ప్రభుత్వం 2014లో మహరాష్ట్రలోని సిరోంచ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి – రేణిగుంట వరకు జాతీయ రహదారి 365ను మంజూరు చేసింది. ములుగు జిల్లా మల్లంపల్లి నుండి నల్లగొండ జిల్లా నకిరేకల్ వరకు 158 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి నిర్మాణం చేపట్టేవిధంగా అనుమతులు మంజూరుచేసింది. 2015లో ప్రారంభమైన పనులు ఇప్పటికీ పూర్తికాలేదు.
జాతీయ రహదారులపై మోదీ నోరు విప్పాలి
విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన అన్ని జాతీయ రహదారులను రామగుండం పర్యటన సందర్భంగా ప్రధాని ప్రకటించాలి. కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించినా.. దస్ర్తాలు ప్రధాని కార్యాలయంలో, నీతి ఆయోగ్ కార్యాలయంలో మూలుగుతున్నాయి. కరీంనగర్-సిరిసిల్ల-కామారెడ్డి-పిట్లం, కరీంనగర్- వీణవంక-జమ్మికుంట-టేకుమట్ల-భూపాలపల్లితోపాటు సిద్దిపేట-సిరిసిల్ల-వేములవాడ -కథలాపూర్-కోరుట్ల, సూరపాక-మంగపేట-ఏటూరునాగారం-తుపాకులగూడెం- కౌటాల, హైదరాబాద్ నుంచి రామగుండంను వెంటనే ప్రకటించాలి. ప్రధాని ప్రారంభించనున్న భద్రాచలం-సత్తుపల్లి రైల్వేలైన్ కోసం సింగరేణి రూ.618.55 కోట్లు భరించింది. -వినోద్‌కుమార్, రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

