న్యూఢిల్లీ, డిసెంబర్ 11: దేశంలోని అన్ని నదుల నీటిని పూర్తిగా సద్వినియోగం చేసుకొని, రైతుల భూములకు తగినంత సాగునీరు అందించటం తమ ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యాంశాల్లో ఒకటని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బల్రామ్పూర్ జిల్లాలో రూ.9,800 కోట్లతో నిర్మించిన సరయూ నహర్ నేషనల్ ప్రాజెక్టును ప్రారంభించిన సందర్భంగా శనివారం ప్రధాని మోదీ మాట్లాడారు. ప్రాజెక్టుల నిర్మాణం పవిత్ర కార్యంలా ఉండాలని వ్యాఖ్యానించారు. ప్రధాని వ్యాఖ్యలు తెలంగాణలో నీటి వినియోగం, వ్యవసాయరంగం శ్రేయస్సు పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విజన్‌ను ప్రతిబింబించాయి. ‘ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేయటం అనేది నిజాయితీగల ఉద్దేశాలు, సమర్థవంతమైన పనితనంతో కూడిన పవిత్ర నిబంధనలాంటిది’ అని మోదీ పేర్కొన్నారు. ఈ మాటలు తెలంగాణలో నూటికి నూరుపాళ్లు ఆచరణలో ఉన్నాయి. అత్యంత యువ రాష్ట్రమైన తెలంగాణను సస్యశ్యామలం చేసిన అత్యంత భారీ, క్లిష్టమైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం (కేఎల్ఐఎస్) కూడా అవే నిజాయితీతో కూడిన ఉద్దేశాలు, మరింత సమర్థవంతమైన
పనితనంతో నిర్మించినదే. నదుల నీటి సద్వినియోగంపై సీఎం కేసీఆర్ ప్రధానికంటే ముందే గత ఏడేండ్లనుంచీ ఇదే చెప్తున్నారు. నదీ జలాల సక్రమవినియోగానికి ప్రణాళికాబద్ధమైన మార్గాన్ని అనుసరించి రాష్ర్టాల మధ్య సుహృద్భావాన్ని నెలకొల్పాల్సిన మోదీ సర్కారు ఎన్నికలు జరిగే రాష్ర్టాల్లో ఏ ఏటికాడి ముచ్చటను అక్కడే మాట్లాడుతున్నది.
ప్రధాని మోదీ నిజాయితీ ఉద్దేశాలు అని చెప్తున్నప్పటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోని ఒక్కో ప్రాంతానికి ఒక్కో విధానం అవలంభిస్తున్నది. యూపీలో సరయూ ప్రాజెక్టుకు కావాల్సినన్ని నిధులిచ్చి పూర్తిచేసిన కేంద్రం, తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగితే మాటవరుసకైనా స్పందించిన పాపాన పోలేదు. ప్రధాని చెప్తున్న ‘నిజాయితీతో కూడిన ఉద్దేశాల’తోనే కాళేశ్వరం ప్రాజెక్టును రాష్ట్రప్రభుత్వం నిర్మించింది. లక్షల హెక్టార్ల భూమికి సాగునీరు, కోట్లమందికి తాగునీరు అందించే ఈ ప్రాజెక్టుతో జాతీయ ప్రయోజనాలు లేవా? ఏండ్లుగా డిమాండ్‌చేస్తున్నా జాతీయ హోదాపై ఎందుకు నోరు మెదుపదు? ఇంతటి భారీ ప్రాజెక్టులు చేపట్టిన రాష్ర్టాలను ప్రోత్సహించాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా? తెలంగాణపై కేంద్రానికి నిర్లక్ష్యం కాదా?
గత ప్రభుత్వాల నిర్లక్ష్యం గురించి కూడా ప్రధాని ప్రస్తావించారు. గత 50 ఏండ్లలో ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల వేలకోట్ల ప్రజా సంపద వృథా అయ్యిందని ఆవేదన వ్యక్తంచేశారు. మరి గత ప్రభుత్వాల వల్ల తెలంగాణ ప్రాంతమంత నిరాదరణకు గురైన ప్రాంతం దేశంలో ఇంకేదైనా ఉన్నదా? 2014లో రాష్ట్రంగా ఏర్పడేవరకూ తెలంగాణ అదే నిర్లక్ష్యానికి గురైంది. రాష్ట్రంగా ఏర్పడిన ఏడేండ్లలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో ప్రతి మూలలోనూ అద్భుత ఆర్థిక ప్రగతికి బాటలు వేసింది. ప్రజాసంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వ పథకాలను ఇతర రాష్ర్టాలే కాదు.. కేంద్రప్రభుత్వం కూడా ఇప్పుడు అనుసరిస్తున్నాయి. రాష్ట్ర బీజేపీ నేతలు ఇప్పటికైనా కండ్లు తెరుస్తారా?
మోదీ మాట.
కొందరు నేతలు ప్రాజెక్టులకు రిబ్బన్లు కట్చేయటానికే ప్రాధాన్యమిస్తారు. దశాబ్దాలు గడిచినా వాటిని పూర్తిచేసి ప్రజలకు అందించాలన్న చిత్తశుద్ధి వారికి ఉండదు. మాది డబుల్ ఇంజిన్ సర్కార్. రిబ్బన్లు కట్చేయటమే కాదు.. వాటిని సమయానికి పూర్తిచేసి ప్రజలకు అందిస్తున్నాం.
తెలంగాణ బాట..
తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం గత ఏడేండ్లలో పదుల సంఖ్యలో ప్రాజెక్టులకు రిబ్బన్లు కట్చేయటమే కాదు.. అంతకుముందు రిబ్బన్లు కట్‌చేసిన వాటిని రికార్డు కాలంలో పూర్తిచేసి రైతులకు పుష్కలంగా సాగునీరు అందిస్తున్నది. దశాబ్దాలుగా గొంతెండిన భూముల దాహార్తి తీరుస్తున్నది. పైగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులకు కేంద్రం నిధులిస్తున్నదని బీజేపీ నేతలు దొంగ ప్రచారాలు చేస్తున్నరు.
మోదీ మాట..
5 దశాబ్దాలలో పూర్తిచేయలేకపోయిన సరయూ ప్రాజెక్టును బీజేపీ ప్రభుత్వం ఐదేండ్లలోనే పూర్తిచేసి 14 లక్షల హెక్టార్లకు సాగునీరందిస్తున్నది.
తెలంగాణ బాట
ప్రపంచంలోనే అతి పెద్దదైన బహుళదశల ఎత్తిపోతల పథకం ‘కాళేశ్వరం’ మూడున్నరేండ్లలోనే పూర్తిచేసి రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందిస్తున్నది. ఇది 13 జిల్లాల్లో 18 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును సృష్టించింది. 37 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించింది. హైదరాబాద్‌కు 30 టీఎంసీల నీటిని అందిస్తున్నది. 170 టీఎంసీల నీటిని 1,800 కిలోమీటర్ల దూరం పారిస్తున్నది.
మోదీ మాట..
దేశంలోని అన్ని నదుల నీటిని పూర్తిగా సద్వినియోగం చేసుకొని, రైతుల భూములకు తగినంత సాగునీరు అందించటం తమ ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యాంశాల్లో ఒకటి.
తెలంగాణ బాట
దేశవ్యాప్తంగా దాదాపు 70 వేల టీఎంసీలకు పైగా నదీ జలాలు అందుబాటులో ఉంటే.. సగం కూడా వాడుకోలేకపోతున్నామని.. నదీ జలాల సమర్థ వినియోగానికి పూనుకోవాలని సీఎం కేసీఆర్ పదే పదే చెప్తున్నారు. ఇన్ని అందుబాటులో ఉన్నప్పటికీ.. రాష్ర్టాల మధ్య వివాదాలు ఎందుకొస్తున్నాయని ప్రశ్నిస్తున్నా మోదీ సర్కారు నుంచి జవాబు లేదు.
మోదీ మాట..
నీటిపారుదల ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేయటం అనేది ప్రభుత్వాల నిజాయితీతో కూడిన ఉద్దేశాలు, సమర్థ పనితనానికి గీటురాయి లాంటివి.
తెలంగాణ బాట..
ప్రధాని అనుకోకుండా ఈ మాటలు అన్నప్పటికీ, అవి తెలంగాణ ప్రభుత్వ లక్ష్యాలను సంపూర్ణంగా ప్రతిబింబించాయి. రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతి నీటిపారుదల ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేసి తన సమర్థతను ఏనాడో చాటుకొన్నది.
మోదీ మాట
50 ఏండ్ల కింద రూ.100 కోట్లతో పూర్తయ్యే అవకాశం ఉన్న ప్రాజెక్టుకు నాటి పాలకుల నిర్లక్ష్యంతో రూ.లక్ష కోట్లు అయ్యింది. ఆ డబ్బంతా ఎవరిది? అది మీది కాదా? మీ సొమ్మును దుర్వినియోగం చేసినవారిని శిక్షించాలా? వద్దా?
తెలంగాణ బాట
తెలంగాణ గొంతు తడిపేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కష్టాలకోర్చి ప్రాజెక్టులను నిర్మిస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి తమ భారాన్ని కొంత మోయాలని రాష్ట్రప్రభుత్వం ఎన్నిసార్లు కోరినామోదీ సర్కారు ఏనాడూ ఈ వినతులను పట్టించుకోలేదు.