అందుకే ప్రధానిపై హక్కుల నోటీసు
జాతికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి
వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలి
టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేకే
తెలంగాణపై మోదీకి చిన్నచూపు: నామా
హైదరాబాద్, ఫిబ్రవరి 10 : దేశానికి ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి రాజ్యాంగాన్ని కించపరిచేలా మాట్లాడటం సరికాదని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు అన్నారు. పార్లమెంటును కించపరుస్తున్నందుకు చాలా బాధగా ఉన్నదని.. ప్రధాని వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకొని, ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దశాబ్దాల తరబడి పోరాడి, ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ సాధించుకొన్నామని, అలాంటి రాష్ట్ర ఏర్పాటుపై ఇలా మాట్లాడితే ఎవరూ సహించరని స్పష్టంచేశారు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, శివసేన, తృణమూల్ సహా విపక్షపార్టీలన్నీ తమకు మద్దతునిచ్చాయని చెప్పారు. గురువారం ఉభయసభల్లో ప్రివిలేజ్ మోషన్ ఇచ్చి వాకౌట్ చేసిన అనంతరం లోక్‌సభలో టీఆర్ఎస్ పక్షనేత నామా నాగేశ్వర్రావుతో కలిసి కేశవరావు మీడియాతో మాట్లాడారు. పార్లమెంటు ఘోర తప్పిదం చేసిందని, సిగ్గుచేటు అని ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడటం బాధాకరమన్నారు. సభ గౌరవానికి, హుందాతనానికి సంబంధించిన అంశం కాబట్టే ప్రివిలేజ్ మోషన్ ఇచ్చామని పేర్కొన్నారు.
రాజ్యాంగంపై గౌరవంతోనే..
రాజ్యాంగంపై గౌరవంతో తాము తీర్మానమిచ్చామని కేశవరావు తెలిపారు. ఒకవేళ నోటీసును స్వీకరిస్తే ప్రివిలేజ్ కమిటీ విచారణ జరిపే అవకాశముంటుందని, సభాహక్కుల ఉల్లంఘన నిరూపణ జరిగి ప్రివిలేజ్ కమిటీ సిఫారసు చేస్తే జైలుకు కూడా పంపే అవకాశముంటుందని చెప్పారు. ఈ తీర్మానం ఆషామాషీగా ఇచ్చింది కాదని, రాజ్యాంగం, పార్లమెంటుపై గౌరవంతో ఇచ్చామని అన్నారు. ప్రధానికి ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా క్షమాపణ చెప్పడం లేదా, వెనక్కి తీసుకోవడం చేస్తారన్న ఆశాభావం వ్యక్తంచేశారు. బిల్లు పాసైన విధానాన్ని సిగ్గుచేటు అన్న ప్రధాని తెలంగాణకు వ్యతిరేకి కాకుండా ఎలా ఉంటారని ప్రశ్నించారు. పార్లమెంటు నిర్వహణకు ఒక విధానం ఉం టుందని, సభలో ప్రొసీడింగ్స్ చూడాల్సిన ప్రిసైడింగ్ అధికారి నిబంధనలకు అనుగుణంగా నడుచుకొంటారని చెప్పారు. సభానాయకుడు అయిన ప్రధాని ఆ ప్రొసీడింగ్స్‌ను, ప్రొసీజర్‌ను అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇది కచ్చితంగా సభా హక్కుల ఉల్లంఘనేనని అన్నారు. ప్రధాని ఏ ఉద్దేశంతో మాట్లాడారో తమకు తెలియదని చెప్పారు. ‘యూపీ ఎన్నికలా? మరో అంశమా! అన్న విషయం మాకు తెలియదు. కానీ, పార్లమెంటు వ్యవహారాలను చెడుగా చూపడం మాత్రం దుర్మార్గం’ అని స్పష్టంచేశారు. ‘మైకులు ఆపేశారు, పెప్పర్ స్ప్రే చేశారు, చర్చ జరగలేదు’ అని ప్రధాని అనడం ఆయన అవగాహనలేమికి నిదర్శనమన్నారు. సభ ఆర్డర్ లేకపోతే లాబీ ఖాళీచేసి.. తలుపులు మూసేయడం ప్రిసైడింగ్ అధికారి నిర్ణయమని తెలిపారు. ఒకసారి బిల్లు పాస్ అని స్పీకర్, చైర్మన్ చెప్తే అదే అంతిమ నిర్ణయమన్నారు. ప్రధానిపై సాధారణంగా ఎవరూ ప్రివిలేజ్ మోషన్ ఇవ్వరని, కానీ ఇవాళ ఆ పరిస్థితి రావడానికి ప్రధాని వ్యాఖ్యలే కారణమని స్పష్టంచేశారు. ఇలా ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వ డం తమకూ బాధగానే ఉన్నదన్నారు. కానీ మోదీ సభను అవమానపరిచేలా, తెలంగాణ ఏర్పాటే సిగ్గుచేటు అని అర్థం వచ్చేలా మాట్లాడారని పేర్కొన్నారు.
కడుపు మంట మాటలు: నామా నాగేశ్వర్రావు
సుదీర్ఘ ఉద్యమం, ప్రాణ త్యాగాల అనంతరం తెలంగాణ తెచ్చుకొన్నామని లోక్‌సభలో టీఆర్ఎస్ పక్షనేత నామా నాగేశ్వర్రావు చెప్పారు. ప్రధాని వ్యాఖ్యలపై యావత్తు తెలంగాణ ప్రజలు ఎంతో బాధ పడుతున్నారన్నారు. లోక్‌సభలో రూల్ 222 కింద ప్రధానిపై సభాహకుల ఉల్లంఘన నోటీసు ఇచ్చామని, సభలో మాట్లాడే అవకాశమివ్వాలని స్పీకర్‌ను కోరామని చెప్పారు. తెలంగాణకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక టీఆర్ఎస్ ఎంపీలందరూ సమావేశాలను బాయ్‌కాట్ చేశామని తెలిపారు. తెలంగాణ ప్రజలు తమకు ఓట్లు వేసి ఢిల్లీకి పంపించారని, ఆ ప్రజలకు అండగా ఉండటం తమ బాధ్యత అని చెప్పారు. కేంద్ర బడ్జెట్లో రూపాయి కూడా ఇవ్వని విషయాన్ని తెలంగాణ నుంచి ఎన్నికైన ఇతర పార్టీల ఎంపీలు గుర్తుంచుకోవాలన్నారు. గుజరాత్ కంటే తెలంగాణలో ఎకువ అభివృద్ధి జరుగుతున్నదని తెలిపారు. అన్ని రంగాల్లో తెలంగాణ ముందంజలో ఉంటే సహాయం ఇవ్వాల్సిందిపోయి అడ్డుకొంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధానికి తెలంగాణ అంటే చిన్నచూపు ఉన్నదని, అందుకే ఎనిమిదేండ్లలో ఒక విభజన హామీ కూడా తీర్చలేదని చెప్పారు. కొత్త రాష్ట్రానికి సమస్యలు ఉంటే తీర్చాల్సింది పోయి.. ఇంకా సృష్టిస్తున్నారని విమర్శించారు. అనంతరం తెలంగాణ భవన్‌లోని అంబేదర్ విగ్రహం వద్ద ఎంపీలు కేకే, నామాతోపాటు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, సంతోష్‌కుమార్, బీబీ పాటిల్, రంజిత్‌రెడ్డి, పీ రాములు, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్ నేత, బడుగుల లింగయ్య యాదవ్ మోదీ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ప్లకార్డులతో నిరసన తెలిపారు.
హక్కుల తీర్మానం.. పూర్తి పాఠం ఇదీ
పార్లమెంట్ ఉభయ సభల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగబద్ధంగా 2014 ఫిబ్రవరి 18 న లోక్‌సభలో, ఫిబ్రవరి 20న రాజ్యసభలో చర్చించి పార్లమెంటరీ నియమాలను పాటించి ఆమోదం పొందింది. అనంతరం రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా గెజిట్ రూపంలో వచ్చింది. ఈ విషయంలో పార్లమెంటే ఫైనల్. కానీ ఈ నెల 8న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంలో.. ప్రధాని నరేంద్రమోదీ రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటరీ సంప్రదాయాలు పాటించలేదని, పెప్పర్ స్ప్రే చల్లి.. పార్లమెంట్ తలుపులు మూసి బిల్లును పాస్చేశారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పడి 8 సంవత్సరాలు కావస్తున్నది. సమయం.. సందర్భం లేకపోయినా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్ర విభజనను సిగ్గుచేటుగా పేర్కొన్నారు. మోదీ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానపరిచారు. కించపరిచారు. పార్లమెంటరీ వ్యవస్థల్లో అత్యంత ప్రధానమైన లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్, ఉభయ సభలు, రాష్ట్రపతి.. ఇలా సకల వ్యవస్థలను ప్రధాని మోదీ అవమాన పరిచారు. విభజన బిల్లు (ఆ మాటకొస్తే అన్ని బిల్లులు)ను సిగ్గుచేటుగా ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి అభివర్ణించడం అంటే సభాహక్కుల ఉల్లంఘనకు పాల్పడటమే.. ఈ నేపథ్యంలో ప్రివిలేజ్ మోషన్ నోటీసు (విశేష అధికార తీర్మానం) ఇస్తున్నాం.