సమైక్య పాలనలో కునారిల్లిన బీసీ కులవృత్తులకు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ జీవం పోశారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్లతోపాటు ఇతర పదవుల్లోనూ బీసీలకు పెద్దపీట వేశారు. రాజ్యాధికారమే కాదు సాధికారతలోనూ అందలం ఎక్కించారు. బీసీ, చేతి కులవృత్తుల కోసం ఉచితంగా లక్ష సాయం అందించే బీసీ బంధుకు శ్రీకారం చుట్టారు. బీసీ కులాలకు సంఘభవనాలు నిర్మిస్తూ వారి ఆత్మగౌరవాన్ని కాపాడారు. బీసీలకోసం ఇంత చేసిన బీఆర్ఎస్, సీఎం కేసీఆర్‌పై హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని నరేంద్ర మోదీ దుష్ప్రచారం చేశారు. బీఆర్ఎస్ పార్టీ బీసీలను మోసం చేసిందంటూ బడుగులను రెచ్చగొట్టేందుకు యత్నించారు. కాగా, బీసీలకు మంత్రి పదవుల్లో పెద్దపీట వేశామని చెప్పి మోదీ.. బీసీ మంత్రిత్వ శాఖ ఎందుకు ఏర్పాటు చేయలేదని బీసీ మేధావులు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బీసీ నేత బండి సంజయ్‌ను పక్కకు పెట్టి కిషన్‌రెడ్డికి పదవి ఎలా ఇచ్చారని నిలదీస్తున్నారు.
హైదరాబాద్, నవంబర్ 7 (సమస్తే తెలంగాణ): ‘బహుజన హితాయ.. బహుజన సుఖాయ’ నినాదాన్ని విధానంగా స్వీకరించి బడుగులకు గొడుగుపట్టింది బీఆర్ఎస్. అధికారం అందని ద్రాక్షగా మారిన బీసీ వర్గాలకు అత్యున్నత శిఖరాలపై నిలబెట్టింది కేసీఆరే. పీపీసీ అధ్యక్షులుగా పనిచేసినా.. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల ఏర్పాటులో క్రియాశీల పాత్ర పోషించిన బీసీలను అణచివేసిందనేది జగమెరిగిన సత్యం. ప్రధాని మోదీ బీసీ అని చెప్పుకోవటానికి తహతహలాడుతున్న బీజేపీది కండ్ల ముందటి చిత్రమే. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న బీసీని తీసి.. తాము అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రిని చేస్తానని బీజేపీ ప్రకటించి మరీ తనను బీసీ వ్యతిరేకి అని చెప్పకనే చెప్పింది. అదే బీఆర్ఎస్ పార్టీ అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో బీసీలను అక్కున చేర్చుకొని అవకాశాలు కల్పించిందని లెక్కలే చెప్తున్నాయి. పార్టీ పదవులైనా.. ప్రభుత్వ పదవులైనా బీసీ వర్గాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ బీఆర్ఎస్ బడుగుల భారత సమితిగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఉమ్మడి రాష్ట్రంలో విపక్షంలో ఉన్నా స్వరాష్ట్రంలో రెండు దఫాలు అధికారాన్ని కొనసాగిస్తూ బీసీ వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు సాగుతున్నది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ 2004లో ప్రముఖ బీసీ నాయకుడు, రాజ్యసభ సభ్యు డు ఆర్. కృష్ణయ్య, రాష్ట్ర ప్రస్తుత బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావును వెంటబెట్టుకొని నాటి ప్రధాని మన్మోహన్సింగ్ను కలిసి కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలని డిమాండ్ చేశారు. దేశంలో 54శాతం బీసీల జనాభా ఉన్నదని విద్య, ఆర్థిక, సామాజిక భద్రత, జీవన ప్రమాణాల పెంపే లక్ష్యంగా పనిచేయడానికి ప్రత్యేక మంత్రిత్వశాఖ ఉండాలని పట్టుబట్టారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం బీసీ వర్గాలకోసం 154 కార్యక్రమాలను అమలు చేస్తామని ప్రకటించిందని, వీటిని అమలు చేయాలంటే బీసీ మంత్రిత్వశాఖ ఉండాలని స్పష్టంచేశారు.
ఆదినుంచీ బీఆర్ఎస్ పార్టీ బడుగులకు గొడుగుగా నిలిచింది. బడుగుల ఆత్మగౌరవాన్ని సమున్నతంగా నిలిపిన పార్టీగా బీఆర్ఎస్కు పేరున్నది. రాజ్యసభ, లోక్‌సభ, శాసనమండలి, శాసనసభ చట్టసభలతోపాటు రాష్ట్రస్థాయి కార్పొరేషన్లు, స్థానిక సంస్థలు, మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీలు, గ్రంథాలయ కమిటీల్లో బీసీలకు బీఆర్ఎస్ పార్టీ సింహభాగం అవకాశాలు కల్పించింది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్లమెటరీ పార్టీ నేత కే కేశవరావును నియమించినా, హరీశ్‌రావు, కేటీఆర్ ఎమ్మెల్యేలుగా ఉన్నా.. బీసీ నాయకుడైన ఈటల రాజేందర్‌ను పార్టీ శాసనసభాపక్షనేతను చేసినా, రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఏర్పాటైన తొలి ఆర్థికశాఖ (నంబర్ 2)ను బీసీ అయిన ఈటల రాజేందర్‌కే అప్పగించినా.. ఆ ఘనత కేసీఆర్‌కే దక్కింది. జీహెచ్ఎంసీ, గ్రేటర్ వరంగల్ మేయర్ ఈ రెండు జనరల్ స్థానాల్లోనూ బొంతు రామ్మోహన్ మొదటిసారి, రెండోసారీ గద్వాల విజయలక్ష్మికి అవకాశం కల్పించారు. గ్రేటర్ వరంగల్‌లో గుండు సుధారాణికి అవకాశం ఇచ్చారు. జీహెచ్ఎంసీ, జీడబ్ల్యూఎంసీ రెండు జనరల్ క్యాటగిరీలకు చెందిన బీసీ మహిళలకు బీఆర్ఎస్ పార్టీ అవకాశం కల్పించింది . తెలంగాణ తొలి శాసనమండలి, శాసనసభ సారథులుగా బీసీ వర్గాల ప్రతినిధులైన స్వామిగౌడ్, సిరికొండ మధుసూదనాచారికి అవకాశం కల్పించారు. ప్రస్తుత శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా పద్మారావుగౌడ్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా బండా ప్రకాశ్‌కు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. నాయకత్వ లక్షణాలున్నవారిని ఎంపిక చేసి మరీ సీఎం కేసీఆర్ వారిని ఆయా రంగాల్లో రాటుతేలేలా చేశారు.
వెనుకబడిన వర్గాల్లోని జనాభా తక్కువగా ఉన్న సామాజికవర్గాల్లోని అణిముత్యాలను వెలికితీసి వారికి సముచిత గౌరవాన్ని కల్పించిన పార్టీగా బీఆర్ఎస్ రికార్డు సృష్టించింది. ప్రత్యక్ష రాజకీయాల్లో నేరుగా తలపడే శక్తి ఉన్నా అనేకానేక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని వెనుకబడిన వర్గాల్లో మరీ ‘వెనుకబడిన’సామాజిక వర్గాలను సీఎం కేసీఆర్ అక్కున చేర్చుకొని అవకాశాలు కల్పిస్తున్నారు. కర్నె ప్రభాకర్, నారదాసు లక్ష్మణ్రావులాంటి వారికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చినా, బీసీ కమిషన్ చైర్మన్‌గా వకుళాభరణం కృష్ణమోహన్‌రావును నియమించినా.. ఈ ఎన్నికల్లో ఇబ్రహీంలోడికి ఎమ్మెల్యే అవకాశం కల్పించినా, రాష్ట్రస్థాయి కార్పొరేషన్లకు చైర్మన్లుగా నందికంటి శ్రీధర్, మఠం భిక్షపతి ఇలా ఎంతోమంది జనాభాతక్కువ ఉన్న వర్గాలకు బీఆర్ఎస్ పార్టీ అక్కున చేర్చుకొని, ఆదరించి అవకాశాలు కల్పించటం తెలిసిందే.