హైదరాబాద్, ఫిబ్రవరి 14(నమస్తే తెలంగాణ) : రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స అందించేందుకు శనివారం కేంద్ర ప్రభుత్వం ‘పీఎం రాహత్(ప్రధానమంత్రి రోడ్ యాక్సిడెంట్ విక్టి మ్ హాస్పిటలైజేషన్ అండ్ అష్యూర్డ్ ట్రీట్మెంట్)’ పథకాన్ని ప్రారంభించింది. ప్రమాద బాధితులకు అత్యవసర చికిత్స అందని కారణంగా సంభవిస్తున్న మరణాలను నివారించేందుకు ఈ పథకాన్ని ప్రా రంభించినట్టు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ వెల్లడించింది.
రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 50శాతం మరణాలు సకాలంలో చికిత్స అందకపోవడంవల్లనే జరుగుతున్నట్టు అధ్యయనా ల్లో తేలినట్టు పేర్కొన్నది. ఎమర్జెన్సీ రెస్పా న్స్ సపోర్ట్ సిస్టం(ఈఆర్ఎస్ఎస్) సమన్వయంతో బాధితులను ప్రమాదం జరిగిన మొదటి గంటలోనే దవాఖానకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులు, ఇతరులెవరైనా 112 హెల్ప్‌లైన్‌కు ఫోన్‌చేసి వివరాలు అందిస్తే బాధితులను వెం టనే అంబులెన్స్ ద్వారా సమీప దవాఖానకు చేర్చి చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది.
ఎలాం టి రోడ్డు ప్రమాదమైనా రూ.1.5 లక్షల వరకు ఉచిత చికిత్స అందించనున్నట్టు, ప్రమాదం జరిగిన రోజు నుంచి ఏడు రోజుల్లోగా చికిత్స పొందవచ్చని తెలిపింది. ప్రాణాపాయం లేని కేసుల్లో 24 గంటల వరకు, ప్రాణాపాయం ఉన్న కేసుల్లో 48 గంటల వరకు చికిత్స(స్టెబిలైజేషన్ ట్రీట్మెంట్) అందించనున్నట్టు వెల్లడించింది. ప్రమాదం జరిగిన వాహనానికి బీమా ఉన్నట్లయితే బీమా కంపెనీ ద్వారా చెల్లింపులు చేస్తామని, ఒకవేళ బీమా లేకున్నా, హిట్ అండ్ రన్ కేసు అయిన పక్షంలో బడ్జెట్ ద్వారా నిధులు మంజూరుచేసి పదిరోజుల్లో చెల్లింపులు పూర్తిచేయనున్నట్టు స్పష్టంచేసింది.