హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): మావోయిస్టుల ఉద్యమానికి భయపడ్డ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా.. చివరికి మావోయిస్టుల శవాలను చూసి కూడా వణికిపోతున్నారని వామపక్ష పార్టీలు, శాంతి చర్చల కమిటీ నేతలు విమర్శించారు. అలాం టి వారికి ఈ దేశాన్ని పాలించే నైతికహకులేదని మండిపడ్డారు. మావోయిస్టు పార్టీ ప్రధా న కార్యదర్శి నంబాల కేశవరావు, మరో ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలను పోలీసు లే దహనం చేయడాన్ని ఖండించారు.
మంగళవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ, శాంతి చర్చల సమన్వయ కమిటీ నాయకుడు ప్రొఫెసర్ హరగోపాల్, జస్టిస్ చంద్రకుమార్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకుడు చలపతి, ఎంసీపీఐ(యూ) మురహరి, వివిధ ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు.
ఆదివాసీలను, మహిళలను, మావోయిస్టులను అక్రమంగా చంపివేసి, కేంద్ర బలగాలు నృత్యాలు చేస్తుంటే ప్రధాని, హోంమంత్రి హర్షం వ్యక్తంచేస్తూ సంబురాలు చేసుకోవడం ఏ రకమైన పాలనకు నిదర్శనం? అటవీ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి కేంద్రం కుట్రలు చేస్తున్నది.
-జాన్వెస్లీ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
మావోయిస్టుల మృతదేహాలను ఏ ప్రమాణాలు పాటిస్తూ పోలీసులే దహ నం చేశారో చెప్పాలి. మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగిస్తే శాంతిభద్రతల సమస్య వస్తుందని కేంద్రం ప్రకటించడమంటే.. మావోయిస్టుల ఉద్యమానికి ప్రజలు మద్దతు పలుకుతున్నట్టే కదా! కేంద్రం ఆరాటమంతా కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడం కోస మే.. అందుకే చర్చలు జరపడం లేదు.
-ప్రొఫెసర్ హరగోపాల్, శాంతి చర్చల సమన్వయ కమిటీ ప్రతినిధి
మావోయిస్టుల మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించకుండా పోలీసులే దహన సంసారాలు నిర్వహించడం అ మానవీయం. ఈ ఘటనను సుప్రీంకోర్టు సుమోటాగా స్వీకరించి, న్యాయవిచారణ జరిపించాలి. చివరికి మావోయిస్టుల మృతదేహాలను కూడా వారి కుటుంబాలకు అప్పగించకుండా అత్యంత క్రూరంగా వ్యవహరించింది.
– కూనంనేని సాంబశివరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
దేశంలో శవాలను అడ్డం పెట్టుకుని రాజకీయాలకు పాల్పడిన చరిత్ర ఎకడా లేదు. ఒకరు చనిపోతే సంబురాలు చేసుకోవడం, ఇది గర్వకారణమని చెప్పడం బీజేపీ పాలకులకు మాత్రమే చెల్లింది. మావోయిస్టుల మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించకపోవడం అత్యంత దుర్మార్గం. హిందుత్వ వారసులమని చెప్పుకునే బీజేపీ నేతలకు ఇది కూడా తెలియకపోవడం సిగ్గుచేటు.
-జస్టిస్ చంద్రకుమార్, హైకోర్టు మాజీ న్యాయమూర్తి