సిద్దిపేట, జూలై 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రంలో అన్నిచోట్ల వర్షాలు కురిసి చెరువుల్లోకి నీళ్లు వస్తున్నాయి. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో మాత్రం తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. అనుకున్న స్థాయిలో వర్షాలు కురవలేదు. ఫలితంగా జిల్లాలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయి. బోరుబావుల్లో నీళ్లు లేవు. రైతులంతా వానకాలం వరినాట్లు వేయడానికి సాగు నీటి కోసం ఎదురుచూస్తున్నారు. నార్లు పోసి రోజులు గడుస్తున్నాయి. వరి నారు నెల రోజుల్లోగా నాటు వేయాల్సిన రైతులు సాగునీరు ఆలస్యం అవుతుండటంతో వేయలేకపోతున్నారు. ‘రేపు వస్తాయి కావచ్చు.. మాపు వస్తాయి కావచ్చు’ అని దీనంగా ఎదురుచూస్తున్నారు. నాటు ఆలస్యమయ్యే సరికి పొలాల్లో గడ్డి ఏపుగా పెరిగిపోయింది. పొలాలు బీడు వారిపోతున్నాయి. ఒక్కో రైతు నారుమడి 50 రోజులు దాటింది. అదును దాటిన తర్వాత సాగుచేస్తే పంట దిగుబడి ఏ మేరకు వస్తుందో అని రైతులు దిగాలు చెందుతున్నారు. వానకాలంలో సిద్దిపేట జిల్లాలో 3.48 లక్షలు, మెదక్ జిల్లాలో 3,27,113 , సంగారెడ్డి జిల్లాలో 1.50 లక్షల్లో వరి సాగు లక్ష్యం కాగా ఎక్కడ కూడా 50 శాతం వరినాట్లు పడలేదు. సాగునీటి కష్టాలతోనే రైతులు వరినాట్లు వేయడం లేదు.
కాళేశ్వర జలాలు వస్తేనే సాగు
కాళేశ్వరం నీళ్లు వస్తేనే సాగు ముందుకు కదిలేలా ఉంది. తక్షణమే అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లు నింపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రిజర్వాయర్లను సకాలంలో నింపడంతో వానకాలం సాగు సాఫీగా సాగింది. రికార్డు స్థాయిలో ధాన్యం పండించారు. నిరుడు ఇదే సమయంలో వరి నాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం జిల్లాలో ఎటుచూసినా బీళ్లు కనిపిస్తున్నాయి. వాగులు ఎండి పోయాయి. ప్రభుత్వం ఏమో రైతుల మొర ఆలకించడం లేదు. జిల్లాలోని ప్రధాన కాలువలు పిచ్చి మొక్కలు, తుంగ, మట్టి తదితర వాటితో పూర్తిగా నిండిపోయాయి. ప్రధాన చెరువులు నీళ్లులేక బోసిపోయి దర్శనమిస్తున్నాయి. గతేడాది బీఆర్ఎస్ ప్రభుత్వం ఎండాకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చెరువులు, కుంటలు నింపడంతో వానకాలంలో ఒకటి రెండు పెద్ద వానలు కురువగానే నీళ్లు వచ్చి చెరువులు అలుగు పారాయి. దీంతో రైతులకు పుష్కలంగా సాగునీరు అందింది.
రైతులు సకాలంలో వరినాట్లు పూర్తి చేసుకున్నారు. ఇవాళ ఆ పరిస్థితులు లేవని రైతులు చెబుతున్నారు. ఉదాహరణకు వర్గల్ మండలంలోని బందం చెరువు ఎప్పుడు కాళేశ్వర జలాలతో నిండుకుండలా ఉండేది. ఇప్పుడు నీళ్లు లేక ఎండిపోయింది. కనీసం కొన్ని ప్రాంతాల్లో గొర్రెలకు తాగడానికి నీళ్లు లేవని గొర్ల కాపరులు చెబుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఎటుచూసినా నీళ్లే కనిపించాయని, ఇవ్వాళ నీటికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెబుతున్నారు. జిల్లాలోని ప్రధాన వాగులైన కూడవెల్లి, హల్దీవాగు బోసిపోయి కనిపిస్తున్నాయి. గతేడాది ఇదే సమయంలో నిండుకుండలా ఉన్నాయి. జిల్లాలోని ప్రధాన రిజర్వాయర్లను గోదావరి జలాలతో నింపితే సిద్దిపేట, మెదక్, యాదాద్రి జిల్లాలతోపాటు ఉమ్మడి నిజామాబాద్‌కు సాగునీటి గోస తీరుతుంది. ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసి తక్షణమే నీటిని విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.