Telangana | జయశంకర్ భూపాలపల్లి, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): జయశంకర్ భూపాలపల్లి జిల్లా సంక్షేమ అధికారిగా పనిచేసి 10 నెలల క్రితం ఉద్యోగ విరమణ పొందిన చిన్నయ్య అనారోగ్యం బారినపడి మృత్యువుతో పోరాడుతున్నాడు. 10 నెలలుగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకపోవడంతో ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. డబ్బులు లేక పేగు క్యాన్సర్‌కు అవసరమయ్యే కీమోథెరపీకి కూడా దూరమయ్యాడు. వివరాలు ఇలా హనుమకొండ రాంనగర్లో నివాసం ఉంటున్న చిన్నయ్య 10 నెలల క్రితం డీడబ్ల్యూవోగా రిటైర్ అయ్యారు. సుమారు రూ.56 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాల్సి ఉన్నది.
బెనిఫిట్స్‌కు సంబంధించిన బిల్స్ మొత్తం జిల్లా ట్రెజరీ ఆఫీస్ ద్వారా ప్రభుత్వానికి సమర్పించాడు. బిల్స్ ఈ-కుబేర్‌లో ఉన్నాయని, సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇస్తే తనకు బెనిఫిట్స్ అందుతాయని చిన్నయ్య చెప్తున్నాడు. ఇప్పటికే పేగు క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నయ్యకు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. కనీసం తనకు రావాల్సిన బెనిఫిట్స్ కూడా రాలేదు. హైదరాబాద్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ హాస్పిటల్లో నెల రోజులపాటు చికిత్స పొందగా సుమారు రూ. 18 లక్షల వరకు అప్పు అయ్యింది. ఇక డబ్బులు చెల్లించే పరిస్థితి లేక ఇంటికి వచ్చాడు. ఇటీవల అప్పు చేసి కీమోథెరపీ చేయించుకున్నాడు. మళ్లీ కీమో చేయించుకోవడానికి వెళ్లేందుకు డబ్బులు లేక అవస్థ పడుతున్నాడు. సర్కారు వెంటనే స్పందించి బెనిఫిట్స్ ఇప్పించి తన ప్రాణాలు నిలుపాలని ఆయన వేడుకుంటున్నాడు.
స్పందించని సర్కార్
ఉద్యోగ సంఘాల నాయకులు సైతం చిన్నయ్య ఆరోగ్య, ఆర్థిక పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయినా, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. సర్కారు స్పందించి సాయం అందించి చిన్నయ్య ప్రాణాలు నిలుపుతుందో లేదో వేచి చూడాలి. చిన్నయ్యకు ఎలాంటి ప్రమాదం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన కుటుంబ సభ్యులు హెచ్చరిస్తున్నారు. ప్రాణాలుపోతున్నా తమ డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడంపై వారు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.