హైదరాబాద్, నవంబర్ 22(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రాజెక్టులను ప్రాధాన్యతాక్రమంలో పూర్తిచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆ శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం ఎర్రమంజిల్‌లోని జలసౌధలో సహచర మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఇరిగేషన్‌శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రాజెక్టుల వారీగా పనుల పురోగతిని, క్షేత్రస్థాయి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీటిని అందించే ప్రాజెక్టుల పనులపై ప్రభుత్వం గతంలోనే ప్రణాళికలు రూపొందించినట్టు గుర్తుచేశారు. ముందుగా ఆరు నెలల్లో పూర్తయ్యే ప్రాజెక్టులపై దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు. ఆయా ప్రాజెక్టుల పూర్తికి వ్యయ అంశాలను సమర్పించాలని సూచించారు. అనంతరం గౌరవెల్లి ప్రాజెక్టుపై సమీక్షించారు.