Sangareddy | సంగారెడ్డి, ఏప్రిల్ 1(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం కొత్త చెరువుతండాలో బీఆర్ఎస్ కార్యకర్త విస్లావత్ హరిసింగ్ (50) హత్యతో ఉద్విగ్న వాతావరణం నెలకొన్నది. సోమవారం ఆయన అంత్యక్రియలు జరిగాయి. మంగళవారం హరిసింగ్ ఇంటిచుట్టూ తండావాసులు, బంధుమిత్రులు కిక్కిరిశారు. భార్య పిప్లిబాయి కంటికి మింటికి ఏకధాటిగా రోదిస్తున్నది. పిల్లలు రేణుక, సునీత, సురేఖ, లత, కొడుకు రాంచరణ్ తల్లి చుట్టూ చేరి తండ్రిని గుర్తుచేసుకుంటూ విలపిస్తుంటే అక్కడున్నవారి కళ్లల్లో కన్నీటిధారలు కట్టాయి. ఈ సందర్భంగా పిప్లిబాయితో ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధి మాట్లాడితే తనలోని ఆవేదనను, ఆగ్రహాన్ని ఇలా తెలిపింది. ఆమె తెలిపిన విషయాలు ఆమె మాటల్లోనే.. ‘తండాలో రెక్కాడితేనే డొక్కాడని గిరిజన కుటుంబం మాది. నా భర్త కూలిపనులు చేస్తుండగా నేను సామాజిక ఆరోగ్య కేంద్రంలో సహాయకురాలిగా పనిచేస్తున్నా. మాకు సొంతిళ్లు లేదు, భూమీ లేదు. రోజూ కష్టపడితేనే కంచంలోకి బువ్వ వస్తుంది. నేను, నాభర్త కష్టపడి ఐదుగురు పిల్లలను సాకాము. ఇప్పుడు రోజూ గ్రామం నుంచి దూరంగా ఉన్న కల్హేర్‌కు వెళ్లి ఇద్దరం కూలిపనులు రోజులు గడుపుతున్నాం. ఎంతో కష్టపడి నలుగురు బిడ్డల పెళ్లిళ్లు చేశాం. ఉన్న ఒక్క కొడుకును కష్టపడి చదివిస్తున్నం. మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి వెంట తిరిగేటోడు. కల్హేర్‌లో, కొత్తచెరువు తండాలో పార్టీ ఏ మీటింగ్ పెట్టినా పాల్గొనేటోడు.
కేసీఆర్, బీఆర్ఎస్ అంటే ప్రాణం
నా భర్త హరిసింగ్‌కు కేసీఆర్, బీఆర్ఎస్ అంటే ప్రాణం. గ్రామంలో అందరికీ కేసీఆర్, బీఆర్ఎస్ గొప్పదనం గురించి చెప్పేవాడు. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీని ఎవరైనా విమర్శిస్తే సహించేవాడు కాదు. వాళ్లకు సరైన సమాధానం ఇచ్చేటోడు. బీఆర్ఎస్ను విమర్శించే అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలకూ దీటైన సమాధానం ఇచ్చేవాడు. ఈ వైఖరి కొత్త చెరువు తండాతోపాటు సమీప తండాల్లోని కొంత మంది అధికారపక్ష నాయకులకు నచ్చక ఆయనతో గొడవకు దిగిన సందర్భాలూ ఉన్నాయి.
పండుగ రోజున..
ఉగాది పండుగరోజైన ఆదివారం ఎప్పటిమాదిరిగానే నేను దవాఖానలో పనిచేసేందుకు వెళ్లాను. హరిసింగ్‌కు కూడా కొత్తచెరువు తండా నుంచి కల్హేర్ బయలుదేరిండు. మార్గమధ్యంలో దవాఖానకు వచ్చి ఇయ్యాళ తొందరగ వెళ్లి పనులు చేసుకో అని చెప్పిండు. నేను డ్యూటీ నుంచి ఇంటికి వెళ్తుండగా, కల్హేర్‌లో కొంత మందితో హరిసింగ్ కనిపించిండు. ఎప్పటిలాగే సాయంత్రం వరకు ఇంటికి వస్తాడని నేను వెళ్లిపోయాను. రాత్రి 10 గంటల వరకు ఎదురుచూసినా ఆయన రాలేదు. మేమంతా భయపడ్డం. కల్హేర్‌లో ఉండి పొద్దున్నే వస్తడేమో అనుకున్నం. తెల్లారాక ఆయన మృతదేహం గ్రామశివారులో ఉన్నట్టు తండావాసుల ద్వారా తెలిసింది. అక్కడ చూస్తే హరిసింగ్ మెడచుట్టూ తువ్వాల చుట్టి ఉన్నది. శరీరంపై గాయాలున్నాయి. నా భర్తను హత్య చేశారని బంధువులు చెప్పడంతో కుప్పకూలిపోయిన. ఎవ్వరికీ హానిచేయని నాభర్త హత్యకు గురయ్యాడని తెలిసి గుండెపగిలిపోయింది. హత్యచేసిన వాళ్లను శిక్షించే వరకు మృతదేహాన్ని కదలనిచ్చేది లేదని అక్కడే ఉన్నం. రాజకీయ కక్షతోనే నా భర్తను హత్య చేశారని అర్థమైంది. బీఆర్ఎస్కు మద్దతుగా నిలవడం, అధికార పార్టీ తప్పులను ఎండగడుతున్నందుకే కక్ష పెంచుకొని హత్య చేశారు. అనుమానం ఉన్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని పోలీసులను కోరాం.
నన్ను, నాబిడ్డను ఆదుకోవాలి
నా భర్త హరిసింగ్ పోయాక నాకు దిక్కుతోచడం లేదు. పదో తరగతి చదువుతున్న కొడుకు రాంచరణ్ ఉన్నాడు. నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. ఐదుగురు పిల్లలు మా నాన్న ఏడని, మాకు దిక్కెవరని ఏడుస్తున్నారు. భూములు, ఆస్తులు, సొంత ఇల్లు లేని మేము దిక్కులేని వాళ్లమయ్యాం. మా కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీని కోరుతున్నా. ఇల్లు కట్టించి ఆదుకోవాలని, ప్రస్తుతం పనిచేస్తున్న దవాఖానలో పర్మినెంట్ చేసి ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా.