చారకొండ/వంగూరు, ఆగస్టు 18 : ‘అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యం.. పథకాల పేరుతో జనాన్ని దగా చేసింది.. అందుకే రేవంత్ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలి’ అని మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, జైపాల్ యాదవ్ బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేయడానికి పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని సూచించారు. సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని చారకొండ, వంగూరు మండల కేంద్రాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలకు వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా మర్రి మాట్లాడుతూ.. కేసీఆర్‌పై అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్..
ఇచ్చిన హామీలు అమలు చేయలేక చేతులెత్తేసిందని దుయ్యబట్టారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ పేరుతో కాలయాపన చేస్తూ డైవర్ట్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నదని విమర్శించారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానన్న సీఎం రేవంత్ నిత్యం గులాబీ దళపతి జపం చేయకుండా ఉండలేకపోతున్నారని ధ్వజమెత్తారు. పార్టీలోకి నేతలు వస్తుంటారు.. పోతుంటారు.. కానీ పార్టీ శాశ్వతంగా ఉంటుందని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో రైతులను ఆదుకున్న ఘనత కేసీఆర్‌కే దక్కిందని అన్నారు. సుమారు 60 లక్షల సభ్యత్వం కలిగిన బీఆర్ఎస్ పార్టీ రాబోయే కాలంలో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి కేసీఆర్‌ను సీఎంను చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.