Rega Kantha Rao | ఎవరికి ఏ ఆపద వచ్చినా తానున్నానంటూ ముందుకు వస్తున్నారు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు. నిత్యం ప్రజల మధ్యలో ఉంటున్నారు. గోదావరి వరదలొస్తే రోజుల తరబడి ఆశ్రయం కల్పించారు. వందలాది మంది వృద్ధులకు వెలుగులు ప్రసాదించారు. కరోనా వేళ.. వేలాది మందికి నిత్యావసరాలు అందజేశారు. ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయించారు. నిరుద్యోగ యువతకు ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తూ పినపాక సేవకుడిగా అందరి మన్ననలు పొందుతున్నారు.
కుమ్రంభీం వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని రేగా కాంతారావు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ‘జల్ జంగల్ జమీన్’ అనే నినాదాన్ని నిజం చేస్తున్నారు. పినపాక నియోజకవర్గంలోని మారుమూల పల్లె కుర్నపల్లిలో నిరుపేద కుటుంబంలో ‘రేగా’ జన్మించారు. వానలు కురిస్తే వారాల తరబడి జలదిగ్బంధంలో ఉండే చిన్న పల్లె అది. అక్కడి మనుషుల జీవన వ్యథలను చూస్తూ పెరిగారు. అప్పుడే చదువుపై శ్రద్ధ పెట్టారు. ఆశ్రమ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించారు. అప్పటి నుంచి యువతలో సామాజిక చైతన్యం కల్పిస్తూ.. సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కాంతారావుకు యూత్‌లో యమ క్రేజ్ ఉన్నది. ప్రతి పల్లెలో ఎంతో మందిని బాబాయ్, పిన్ని.. అంటూ వరుసలు పెట్టి పిలిచేంత సాన్నిహిత్యం ప్రజలతో రేగాకు ఏర్పడింది.
2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 2018లో జరిగిన ఎన్నికల్లోనూ గెలుపొందారు. సీఎం కేసీఆర్‌తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని భావించి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయన ప్రతిభను గుర్తించిన సీఎం కేసీఆర్.. ప్రభుత్వ విప్‌గా అవకాశమిచ్చారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పినపాక అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గెలుపు ఖాయమనే దీమాతో ఉన్నారు.
కాంతారావు సోదరుడి పేరిట ‘రేగా విష్ణు చారిటబుల్ ట్రస్ట్’ను స్థాపించారు. 2 వేల మంది నిరుద్యోగులకు వివిధ యూనివర్సిటీలల్లో ఉచిత కోచింగ్ ఇప్పిస్తున్నారు. వెయ్యి మందికి పైగా వృద్ధులకు ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించారు. కరోనా సమయంలో సొంత ఖర్చులతో వేలాది మందికి నిత్యావసరాలు పంపిణీ చేశారు. గోదావరి వరదలొస్తే రోజుల తరబడి ఆశ్రయమిచ్చి… నిర్వాసితుల ఆకలిని తీర్చారు. మణుగూరులో గ్రంథాలయం నిర్మించి ఎంతోమందికి విజ్ఞానాన్ని పంచుతున్నారు. ఆర్థిక పరిస్థితి బాగాలేక ఎంబీబీఎస్‌ను మధ్యలోనే వదిలేసే పరిస్థితి వస్తే.. సొంత ఖర్చులతో చదివిస్తున్నారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా తానున్నానంటూ.. ఆదుకుంటున్నారు.