హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగులకు క్రీడలు ఎంతగానో దోహదపడుతాయని అటవి శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ రాకేశ్ మోహన్ డోబ్రియాల్ అన్నారు. మంగళవారం దూలపల్లిలోని తెలంగాణ రాష్ట్ర అటవి అకాడమీ ఆధ్వర్యంలో అటవీ అధికారుల రాష్ట్రస్థాయి క్రీడోత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులనుద్దేశించి మాట్లాడారు. క్రీడలు ఆరోగ్యానికి ఎంతో అవసరమన్నారు.
నిత్యం విధి నిర్వహణలో ఉండే ఉద్యోగులు పనుల నుంచి ఉపసమనం పొందేందుకు క్రీడలు వెసులుబాటునిస్తాయని అన్నారు. వివిధ పోటిల్లో పాల్గొంటున్న క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో పాల్గొనాలని కోరారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహించే ఈ క్రీడల్లో పరుగు పందేలు, లాంగ్‌జంప్, వెయిట్‌లిఫ్టింగ్, డిస్కస్‌త్రో, క్యారమ్స్, చెస్, రైపిల్షూటింగ్, బ్యాడ్మింటన్, కబడ్డీ, క్రికెట్ వంటి పోటీలను నిర్వహిస్తున్నారు.
రెండు రోజుల పాటు జరిగే ఈ క్రీడల్లో చార్మినార్, భద్రాద్రి, రాజన్న, యాదాద్రి, జోగులాంబ, బాసర, కాళేశ్వరం అటవీ సర్కిళ్లకు చెందిన వివిధ జిల్లాల నుంచి అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అటవి అకాడమీ సంచాలకులు ఎల్యుసింగ్ మేరు, ఉన్నతాధికారులు ఎంసి పర్గేయిన్, జి.చంద్రశేఖర్‌రెడ్డి, సునీతభగవత్, సోనీబాలాదేవి, వినోద్‌కుమార్, రామలింగం, రమేశ్, సైదులు, భీమానాయక్, శివాని, డోగ్రా, వివిధ జిల్లాల అధికారులు, డివిజనల్ అధికారులు, అకాడమీ అధికారులు, క్రీడాకారులు పాల్గొన్నారు.