హైదరాబాద్, మే 14(నమస్తే తెలంగాణ) : బండి భగీరథ్ చేతిలో మోసపోయిన బాధిత బాలికనే నిందితురాలిగా చూపించే కుట్ర జరుగుతున్నది. నిందితుడితో ఉన్న బాధితురాలి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేయిస్తున్నారు. ఆమె గౌరవ మర్యాదలకు భంగం కలిగిస్తూ.. పోక్సో కేసు నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఆమెనే కుట్రదారుగా సోషల్ మీడియాలో చూపిస్తున్నారు. ఇదంతా ఎవరు చేయిస్తున్నారు? ఎందుకు చేయిస్తున్నారు? ఆ వీడియోలు ఎవరు లీక్ చేశారు? అనే దానిపై ఆరా తీయాల్సిన పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు కో ర్టు తీర్పుల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బాధిత బాలిక వీడియోల వెనుక ఉన్నది కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సైన్యమే అని స్పష్టంగా అర్థమవుతున్నది. మైనర్‌పై రేప్ జరిగిందంటూ ఫిర్యా దు ఇచ్చిన పేట్‌బషీర్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. బాలిక ఫొటోలు, వీడియోలతో పాటు ఆ ఎఫ్ఐఆర్ కాపీ, బాధితులు ఇచ్చిన ఫిర్యాదు ప్రతులు కూడా వైరల్ అవుతున్నాయి? వాటిని బహిర్గతం చేసింది ఎవరు? అనే విషయాలపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.
పోక్సో కేసులో బాధితురాలైన బాలికనే.. నిందితురాలిగా మార్చేందుకు ఆమె వ్యక్తిత్వ హననానికి కుట్రలు జరుగుతున్నాయి. అత్యంత కఠినమైన సెక్షన్లు ఉన్న పోక్సో కేసులో బాధితురాలి ఫొటోలు, వీడియోలు.. ఆమె తల్లిదండ్రుల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అడ్డగోలుగా డబ్బులకు అమ్ముడుపోయే కొందరు సోషల్ మీడి యా ఇన్ఫ్లూయెన్సర్లను కొనుగోలు చేసి.. పెయిడ్ బ్యాచ్‌తో బాలిక క్యారెక్టర్‌ను కించపరుస్తున్నారు. ఇదంతా కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ ఓ పథకం ప్రకారం కుట్రపూరిత వీడియోలు, ఏఐ మార్ఫింగ్ వీడియోలు, గ్రాఫిక్ కంటెంట్‌తో ఆమె వ్యక్తిత్వ హననానికి ప్పాల్పడుతున్నారు. కొందరు సోషల్ మీడియాలో చర్చలు పెడుతూ, గ్రూపుల్లో ఆమె వీడియోలు షేర్ చేస్తూ.. తనే హనీట్రాప్ చేసిందని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఇందులో కూడా బాధిత బాలిక స్నేహితులతో ఉన్న ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారే తప్ప.. నిందితుడితో ఉన్నవి, ఆయన తన వెంటన బాలికను తిప్పుకొన్నవి మాత్రం బయటకు రావడం లేదు. కేవలం ఆ ఫొటోలు మాత్రమే విడుదల అవుతుండటంపై ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి.
పోక్సో కేసులో.. ప్రధాన నిందితుడిగా ఉన్నది కేంద్ర మంత్రి సంజయ్ కుమారుడు కావడంతో నేటికీ అతన్ని అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు సంజయ్ సోషల్ మీడియా, బీజేపీ ఐటీ సెల్, బండి భగీరథ్ అనుచరగణం.. బాధిత బాలిక ఫొటోలు, వీడియోలు, ఆమె తల్లిదండ్రుల పూర్తి వివరాలు, ఫొటోలు వీడియోలు, వారి రేషన్‌కార్డు సహా సోషల్ మీడియాలో పెడుతున్నా.. సైబర్ క్రైమ్ పోలీసులు సైలెంట్‌గా ఉన్నారు. ఉమెన్ సేఫ్టీ వింగ్ నుంచి కూడా ఎలాంటి ఖండనలు లేవు. బాధిత కుటుంబాన్ని బ్లేమ్ చేస్తున్న వారిపై ఎలాంటి హెచ్చరికలూ జారీ చేయడం లేదు.
పోక్సో చట్టం-2012లోని సెక్షన్-23 ప్రకారం.. బాధితుల గుర్తింపు వెల్లడించకూడదు. ఏదైనా వార్తాపత్రిక, మ్యాగజైన్, వెబ్సైట్ లేదా మరే ఇతర ప్రసార మాధ్యమం అయినా, పోక్సో కేసులో చికుకున్న బాధితులకు సంబంధించిన వివరాలను బహిర్గతం చేయకూడదు. కేసు విచారణలో ఉన్నప్పుడు, ప్రత్యేక కోర్టు అనుమతి ఇస్తే తప్ప, వివరాలను వెల్లడించే అధికారం ఎవరికీ ఉండదు. అది కూడా బాధితుల ప్రయోజనాల దృష్ట్యా మాత్రమే కోర్టు అనుమతించవచ్చు. ఈ సెక్షన్లను ఎవరైనా ఉల్లంఘిస్తే వారికి కనీసం ఆరు నెలల నుంచి ఏడాది వరకు జైలు శిక్ష పడుతుంది. ఒక్కోసారి జరిమానా కూడా విధిస్తారు. లైంగిక దాడికి గురైన పిల్లలు భవిష్యత్తులో సామాజికంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురోకూడదని, వారి గౌరవం దెబ్బతినకూడదని చట్టం ఈ రక్షణ కల్పించింది.
తెలంగాణలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాలు, ప్రభుత్వ అక్రమాలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా నిమిషాల వ్యవధిలో కేసులు కట్టి.. అర్ధరాత్రుళ్లు అరెస్టు చేస్తున్నారు. అలాంటిది పోక్సో కేసులో ఓ బాలికపై ఓ వర్గం మీడియా, సోషల్ మీడియా ఆమెను నిందితురాలి మార్చే కుట్ర చేస్తుంటే పోలీసులు పట్టించుకోవడం లేదు. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేతలు, సామాన్యులు ప్రభుత్వాన్ని ప్రశ్ని స్తే.. అరెస్టులకు పాల్పడ్డారు. వారి అరెస్ట్ అక్రమమని సుప్రీంకోర్టుకు వెళ్తే.. వారికి బెయిల్ ఇవ్వొద్దంటూ గంటకు రూ.30లక్షల ఫీజులు తీసుకునే పెద్దపెద్ద అడ్వకేట్ల్లతో కేసులు వాదించారు. అదే పోక్సో కేసులో బండి సంజయ్ కొడుకు ఉంటే.. హైకోర్టులో కేసు వాదించేందుకు సాధారణ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమించడాన్ని చూస్తే ప్రభుత్వ, పోలీసుశాఖ వైఖరి ఏమిటో అర్థమవుతున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇకనైనా నిందితుడు భగీరథ్‌ను అరెస్ట్ చేయడంతో పాటు, సోషల్ మీడియాలో బాలిక ఫొటోలు, వీడియోలు వైరల్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
1) జోర్దార్ సంతోష్
2) వరసిద్ది తొడుపునూరి
3) ఏ1 టీవీ
4) మగధ న్యూస్
5) భరత్ బీజేపీ ఐటీ సెల్
6) వారధి శ్రీను పటేల్ బీజేపీ
7) ప్రజా సంగ్రామ యాత్ర (బండి సంజయ్ ఆఫీసు)
8) టీమ్ పాయల్ శంకర్ (బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆఫీసు)
9) హరీశ్‌రెడ్డి (బీజేపీ ఐటీ సెల్)
10) క్యాప్‌జెమినీ
11) బీఎస్కే సేన
12) బీజేపీ బీజేవైఎం జగిత్యాల
13) సాహో సంజయ్