హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్ సవాల్‌ను స్వీకరిస్తున్నాం.. బీఆర్ఎస్ 28 మంది ఎమ్మెల్యేలు డ్రగ్ టెస్ట్‌కు సిద్ధమని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ప్రకటించారు. అయితే డ్రగ్ టెస్ట్‌కు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా రావాలని.. మంగళవారం రాత్రి 8 గంటల్లోగా ఎక్కడికి రావాలో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రముఖ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమక్షంలో అందరం టెస్టు చేయించుకుందామని, ఒకవేళ మీరు రాకపోతే డ్రగ్స్ తీసుకుంటున్నట్టు భావిస్తామని చెప్పారు. తెలంగాణభవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల తొలినాళ్లలో తనను రేవంత్‌రెడ్డి డ్రగ్స్ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. తాజాగా రాజ్ పాకాల ఇంట్లో కూడా ఇదే జరిగిందని, కేటీఆర్ ఫంక్షన్ వస్తారనుకొని ఇరికించాలని రేవంత్‌రెడ్డి ప్లాన్ చేశారని ఆరోపించారు. తనతో సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నదని నిజం కాదా? అని నిలదీశారు. రేవ్ పార్టీలో వృద్ధులు, చిన్న పిల్లలు ఉంటారా? అని పాడి కౌశిక్‌రెడ్డి నిలదీశారు. కొందరు కావాలని రాజ్ పాకాల ఇండ్లలోకి వెళ్లిన ఫంక్షన్‌ను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. వ్యక్తిగతంగా ఇబ్బంది పెడితే రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్, దుబాయిలో ఏం చేశారో చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. అప్పుడు రేవంత్‌రెడ్డిని ఇంట్లోకి రానివ్వరని తెలిపారు.