హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : ‘లెజిస్లేటివ్ ట్రిబ్యునల్‌లో స్పీకర్ సమక్షంలో ఫిరాయింపులపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో సందర్శకులకు, మీడియాకు అసెంబ్లీ ప్రవేశాన్ని ఎందుకు నిషేధించిండ్రు? ఇది నిజాం రాజ్యమా? నియంత రాజ్యమా?’ అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ నిప్పులు చెరిగారు. తెలంగాణ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిషేధాజ్ఞల బులెటిన్ జారీ చేసిన అసెంబ్లీ స్పీకర్ విధానాన్ని తప్పుబట్టారు. సందర్శకులతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమెల్సీల ప్రవేశాన్ని కూడా నిషేధించడం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారి పార్టీ కార్యాలయానికే పరమితం కావాలని ఆదేశించడం ఏమిటని ప్రశ్నించారు. ఈ కేసులు వాదిస్తున్న అడ్వొకేట్లు సెల్ఫోన్లు కూడా తీసుకురావొద్దని హుకుం జారీ చేయడంపైనా మండిపడ్డారు. ‘ఇలా బులెటిన్ జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధం.. ఏ గూడుపుఠాణీ నడపడం కోసం ఇలా అందరికీ నిషేదాజ్ఞలు విధించారు?’ అని నిలదీశారు. ‘సుప్రీంకోర్టు ఫుల్బెంచ్లో వాదనలు కొనసాగుతున్నప్పుడు కూడా సెల్ఫోన్లకు అనుమతిస్తరు.. ఇది అసెంబ్లీ స్పీకర్ సొంత వ్యవహారమో.. సీఎం రేవంత్‌రెడ్డి సొంత వ్యవహారమో కాదు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణమే బులిటెన్ ద్వారా జారీ చేసిన నిషేధాజ్ఞలను ఎత్తివేయాలని, విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధోగతి పాలు చేశారని దాసోజు మండిపడ్డారు. రాష్ట్ర బడ్జెట్ రూ.2.30 లక్షల కోట్లుగా ప్రతిపాదించగా, ఈ ఏడాది సెప్టెంబర్ వరకు వాటిలో కేవలం రూ.76 వేల కోట్లనే విడుదల చేశారని దుయ్యబట్టారు. అంటే బడ్జెట్ ప్రతిపాదన లక్ష్యం కేవలం 33 శాతానికే పరిమితమైందని మండిపడ్డారు. ఇక రెవెన్యూ వసూళ్లలో 40 శాతం మించలేదని విమర్శించారు. జీఎస్టీ వసూళ్లలోనూ 42 శాతానికే పరిమితమైందని దుయ్యబట్టారు. రేవంత్ అధికారంలోకి వచ్చిన రెండేండ్లలోనే రియల్ ఎస్టేట్ సర్వనాశనమైందని నిప్పులు చెరిగారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా రూ.19 వేల కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకోగా, రూ.7 వేల కోట్లే వసూలయ్యాయని, అంటే కేవలం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ద్వారా 32 శాతమే ఆదాయం వచ్చిందని, దానికి కొనసాగింపుగా ఎక్సైజ్ ఆదాయం 35 శాతంలోపే వచ్చిందని ఆయన విమర్శించారు.
ఒక రాష్ర్టానికి అనుభవం లేని ముఖ్యమంత్రి ఉంటే ఏం జరుగుతుందో అదే జరిగిందని దాసోజు శ్రవణ్‌కుమార్ దుయ్యబట్టారు. హైడ్రా పేరిట, ఆర్ఆర్ ట్యాక్స్ పేరిట దోపిడీ చేశారని ఆయన నిప్పులు చెరిగారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో విచ్చలవిడిగా బోగస్ ఓటింగ్ జరిగిందని, ఈ విషయాన్ని తాము ప్రత్యక్షంగా చూశామని మండిపడ్డారు. పోలీసులు కూడా బోగస్ ఓట్ల కోసం కాంగ్రెసోళ్లకు సంపూర్ణంగా సహకరించారని విమర్శించారు. ఎంఐఎం పార్టీ కూడా ఈ ఎన్నికలో అక్రమాలకు పాల్పడిందని, ఎన్ని అక్రమాలు చేసినా చివరికి ధర్మమే గెలుస్తుందని స్పష్టంచేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నేత సతీష్‌రెడ్డి, హరి రమాదేవి, కల్వకుర్తి శ్రీనివాసయాదవ్ పాల్గొన్నారు.
రాష్ర్టానికి రాబడి శాతం గణనీయంగా తగ్గుతుంటే, అప్పులు మాత్రం అదే రీతిలో పెరుగుతున్నాయని శ్రవణ్ మండిపడ్డారు. రాష్ట్ర అప్పుల శాతం 83 శాతానికి చేరుకున్నదని, కాంగ్రెస్ వచ్చిన రెండేండ్లలోనే రూ. 3.48 లక్షల కోట్ల అప్పు చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. పైగా ఇవికాకుండా మరో లక్ష కోట్ల బడ్జెట్ ప్రతిపాదనలకు సంబంధం లేని అప్పులు తెచ్చారని ఆరోపించారు. ఇన్ని కోట్ల అప్పులు తెచ్చినా చివరికి రాష్ర్టానికి ఒరగబెట్టిందేమీ లేదని ఫైర్ అయ్యారు.