హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం తన వరుస వైఫల్యాల నుంచి కప్పిపుచ్చుకొనేందుకు.. తన సహజసిద్ధమైన డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా మరోసారి ఫోన్‌ట్యాపింగ్ అంశాన్ని తెరమీదికి తేనున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెప్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని మరోసారి ముందుపెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే రెండు సిట్లు వేసిన ప్రభుత్వం.. ఏమీ తేల్చలేదన్న ఆరోపణలున్న విషయం తెలిసిందే. ఈ కేసుపై ఏదో ఒకటి చేయాలని భావిస్తున్న కాంగ్రెస్ సర్కార్.. తాజాగా పాత ఫైళ్లను దుమ్ముదులిపింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ అంటూ బీఆర్ఎస్పై రాజకీయ ప్రతీకారం తీర్చుకొనేందుకు కాలుదువ్విన కాంగ్రెస్ సర్కార్.. విచారణల పేరుతో గడిచిన 32 నెలలుగా నానా విన్యాసాలు చేస్తున్నది.
రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీనపడుతున్నడప్పుడల్లా.. ప్రభుత్వ నిష్క్రియాపరత్వం, డొల్లతనం బయటపడిన సందర్భాల్లో, ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం సన్నగిల్లుతున్న ప్రతి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక డైవర్షన్ డ్రామా చేయడం అలవాటైపోయింది. ఇలాంటి అనేక సందర్భాల్లో ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంపై ఏదో ఒక లీకు ఇచ్చి మీడియాలో దుష్ప్రచారం చేయించారు. విచారణ పేరుతో బీఆర్ఎస్ అగ్రనాయకులను పిలిచి గంటల తరబడి కూర్చోబెట్టి వారు చెప్పని, విచారణలో లేని అంశాలను దురుద్దేశంతో ప్రచారం చేయించారు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ దారుణంగా పడిపోతున్నది. పార్టీలో కూడా లుకలుకలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు, ప్రభుత్వ ముఖ్యులు మరోసారి ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ కేసులో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్కు చెందిన ముఖ్యనేతలందరినీ ఇరికించేందుకు స్కెచ్వేశారు. దీని కోసమే కసరత్తు చేశారు. వారం రోజుల్లోపే ఫోన్ ట్యాపింగ్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానంలో చార్జ్‌షీట్ వేయనున్నది.
ఫోన్ ట్యాపింగ్ కేసు న్యాయస్థానంలో నిలబడ్డా, నిలబడకపోయినా సరే బీఆర్ఎస్ టార్గెట్‌గానే ఉండాలని, పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు పేర్లు కచ్చితంగా ఉండేలా చూడాలని ప్రభుత్వంలోని ముఖ్యనేత నుంచి హుకుం జారీ అయినట్టు విశ్వసనీయంగా తెలిసింది. వాస్తవానికి పోలీసుల ప్రధాన విచారణ మొత్తం ఫిబ్రవరి ఒకటో తేదీనే ముగిసింది. ఆ తర్వాత చార్జ్జిషీట్ వేయడానికి ఒక నెల రోజులు సరిపోతుంది. కానీ, దాదాపు ఆరు నెలలు అయినప్పటికీ, ఇంకా చార్జిషీట్ ఒక కొలిక్కిరాలేదు. పార్టీకి సంబంధించిన అగ్రనేతలందరూ ఉండాల్సిందేనన్న ఆదేశాలు రావడంతో విచారణ చేస్తున్న అధికారులు కిందామీద పడుతున్నారు. చార్జ్‌షీట్ వేసి అవసరమనుకొంటే అనుబంధ చార్జిషీట్ కూడా వేసుకోవచ్చు. కానీ, అలా చేయడంలేదు. రాష్ట్రంలో ప్రభుత్వం మారి 32 నెలలు అవుతున్నదని, ఇప్పటికీ ఈ కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడం రాజకీయంగా తమకు ఇబ్బందిగా మారిందని ముఖ్యనేత తన కింది అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. తన ప్రతిష్టకు సంబంధించిన అంశమని, ఏదో ఒకటి చేసి కేసులో బీఆర్ఎస్ అగ్రనేతల పేర్లుండేలా చూడాలని చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
వాస్తవానికి ఇక్కడి కేసులో విషయం లేదని న్యాయనిపుణులు చెప్తున్నారు. రాజకీయ కక్ష ఉండటంతోనే కేసును సాగదీస్తున్నారని అంటున్నారు. అయితే, ఇక్కడ విచారణ మొత్తాన్ని ఢిల్లీలోని ఓ ప్రైవేట్ న్యాయవాది బృందం పర్యవేక్షిస్తున్నది. సుప్రీంకోర్టులో పేరున్న ఆ న్యాయవాదికి ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వంలోని ఓ ముఖ్యనేత వ్యక్తిగత హోదాలో కట్టబెట్టినట్టు తెలిసింది. ఇక్కడి అధికారులు న్యాయ సలహా పేరుతో అక్కడికి వివరాలన్నీ పంపించడం ఢిల్లీలోని సుప్రీంకోర్టు న్యాయవాది రోజువారీగా ఏం చేయాలన్నది చెప్తున్నారని సమాచారం. రాష్ట్ర ముఖ్యనేత కేసులను, ఆయన పాత బాసు కేసులను ఈ న్యాయ నిపుణుడే సుప్రీంకోర్టులో వాదిస్తుంటారు. అందుకే అత్యంత నమ్మకంతో ఫోన్‌ట్యాపింగ్ కేసు మొత్తాన్ని ఆయన చేతిలో పెట్టారు. ఇప్పుడు ఆ న్యాయవాది డైరెక్షన్ మేరకే అతి త్వరలో చార్జ్‌షీట్ దాఖలు చేయబోతున్నారు.
బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలతోపాటు మరికొందరి పేర్లను కూడా చేర్పించేందుకు రంగం సిద్ధంచేసినట్టు తెలిసింది. పార్టీకి సంబంధించిన రాజకీయ నేపథ్యం ఉన్న 8 మంది నేతల పేర్లను చార్జిషీట్లో ప్రస్తావిస్తారని చెప్తున్నారు. ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సహా పలువురి పేర్లను పేర్కొన్నట్టు తెలుస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు తమను బెదిరించారంటూ పలువురితో 164 స్టేట్మెంట్లు కూడా రికార్డు చేయించినట్టు తెలిసింది. స్టేట్మెంట్లు ఇచ్చేందుకు తొలుత ఎవ్వరూ ముందుకు రాలేదని సమాచారం. తమను ఈ అంశంలోకి లాగవద్దని, తమకెలాంటి సంబంధంలేదని, రాజకీయ పార్టీకి ఇచ్చిన విరాళాల విషయంలో బలవంతం ఏమీలేదని చెప్పినట్టు తెలిసింది. తాము అన్ని పార్టీలకు విరాళాలు ఇచ్చామని, ఇలా ఒకరిపై ఫిర్యాదు చేసినట్టు చెప్పడం సరికాదని పలువురు వ్యాపారవేత్తలు సుతిమెత్తగా సిట్ అధికారులతో చెప్పినట్టు తెలిసింది. అయితే, కొంతమంది వ్యాపారవేత్తలను తమదైన శైలిలో దారికి తెచ్చుకొని వారితో స్టేట్మెంట్లు ఇప్పించినట్టు తెలుస్తున్నది. అ యితే, ఎంతమంది స్టేట్మెంట్లు ఇచ్చా రు? ఎంతమంది స్టేట్మెంట్లు ఇవ్వడానికి నిరాకరించారన్న విషయంపై స్పష్టత లేదు. చార్జ్‌షీట్ దాఖలయ్యే వరకు 164 స్టేట్మెంట్ల అంశం బయటకు రాకుండా ఉండేలా గోప్యత పాటిస్తున్నట్టు తెలుస్తున్నది.
సిద్ధం చేసిన చార్జ్‌షీట్‌ను సిట్ అధికారులు వారం రోజుల్లోపే న్యాయస్థానంలో దాఖలు చేయనున్నట్టు తెలిసింది. దీని కోసం కూడా పెద్ద కసరత్తు చేస్తున్నారు. న్యాయస్థానంలో చార్జ్‌షీట్ దాఖలు చేసిన వెంటనే కేసు విచారణ ప్రక్రియను వేగవంతం అయ్యేలా చూసేందుకు దేశంలోని ఓ ప్రముఖ న్యాయవాదిని కూడా మాట్లాడిపెట్టుకున్నారు. న్యాయసలహా ఇస్తున్న ఢిల్లీ న్యాయవాదితోపాటు ప్రముఖ న్యాయవాది కూడా ఉంటారని చెప్తున్నారు. చార్జ్‌షీట్ మొత్తం వీరి కనుసన్నల్లోనే తయారైన నేపథ్యంలో కేసుపై ముందుకెళ్లడం వీరికి సులభం.
చార్జ్‌షీట్ సిద్ధం చేయించిన ప్రభుత్వం ఏ పత్రికకు, ఏ మీడియాకు ఏయే లీకులు ఇవ్వాలన్నది కూడా ఇప్పటికే సిద్ధం చేసినట్టు చెప్తున్నారు. భారీగా సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌లో తాము ప్రచారం చేయదల్చుకున్న విషయాలను ప్రత్యేకంగా ఒక నోట్ రూపంలో సిద్ధంచేసినట్టు చెప్తున్నారు. ఆ నోట్లోని అంశాలను మీడియా కోసం ఉపయోగించాలని భావిస్తున్నట్టు తెలిసింది. దీని కోసం ప్రభుత్వంలోని ఒక అంతర్గత యంత్రాం గం ప్రత్యేకంగా పనిచేస్తున్నది.