హైదరాబాద్, డిసెంబర్ 26(నమస్తే తెలంగాణ) : ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు రెండో దఫా కస్టోడియల్ విచారణ ముగిసింది. ఈ నెల 25తో ఆయన విచారణ ముగిసిన వెంటనే.. విడుదల చేయాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో ఆ మేరకు సిట్ ఆయన్ను విడుదల చేసింది.
శుక్రవారం ఆరోగ్యపరంగా అన్ని పరీక్షలు నిర్వహించి రిలీజ్ చేసింది. కాగా, ఈ కేసులో ప్రముఖ సెఫాలజిస్ట్ ఆరా మస్తాన్ విచారణ ముగిసింది. శుక్రవారం సిట్ పిలుపుమేరకు మరోసారి వచ్చిన మస్తాన్‌ను సుమారు రెండున్నర గంటలపాటు విచారించి రెండోసారి స్టేట్మెంట్ను రికార్డ్ చేసింది. జస్ట్ కన్ఫర్మేషన్ కోసమే తనను పిలిచారని విచారణ తర్వాత మస్తాన్ మీడియాతో చెప్పారు.