హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): జల వివాదాలపై ఢిల్లీలో శుక్రవారం కీలకమైన భేటీ జరుగనున్నది. అదే సమయంలో తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నోటీసుల పేరిట గారడీకి రేవంత్‌రెడ్డి సర్కార్ తెరతీసింది. ఏపీ జలదోపిడీ నుంచి తెలంగాణ సమాజం దృష్టిని మరల్చేందుకే ఈ నాటకానికి తెరతీశారనే అభిపాయం వ్యక్తమవుతున్నది. ఇప్పటికే ఏపీ సర్కార్ సాగిస్తున్న జల దోపిడీ, అందులో రేవంత్‌రెడ్డి సర్కార్ నిర్లక్ష్యాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బాహాటంగానే విమర్శించారు. అదేమీ లేదంటూ బుకాయించిన రేవంత్ సర్కార్.. తాజాగా మరోసారి భేటీ పేరిట ఏపీ సర్కార్ జల దోపిడీకి వంతపాడుతున్నది. ఈ నేపథ్యంలో నోటీసుల పేరిట మరోసారి డైవర్షన్ రాజకీయాలకు తెరతీశారనే విమర్శలొస్తున్నాయి.
కేంద్ర జల్‌శక్తి శాఖ భేటీపై ప్రస్తుతం ఇంజినీర్లు, నీటిరంగ నిపుణులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. తెలంగాణ లేవనెత్తిన అంశాలన్నీ దాదాపు కృష్ణా జలాలకు సంబంధించినవే. ఇందులో పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల డీపీఆర్‌లకు అనుమతులు, నీటి వినియోగ పరిమాణాల నమోదుకు టెలిమెట్రీల ఏర్పాటు, ఏపీ చేపట్టిన రాయలసీమ లిఫ్ట్ విస్తరణ, ఔట్ బేసిన్‌కు జలాల మళ్లింపు అంశాలు ఉన్నాయి. ఇవన్నీ రాష్ట్ర విభజన నాటి నుంచీ కొనసాగుతున్న జల వివాదాలే. గత పన్నెండేండ్లుగా అనేకమార్లు విజ్ఞప్తులు సమర్పించడంతోపాటు ఏపీ ప్రాజెక్టులపై ఫిర్యాదులు చేస్తూనే ఉన్నామని తెలంగాణ ఇంజినీర్లు, నీటిరంగ నిపుణులు వివరిస్తున్నారు.
అయితే, వాటన్నింటికీ ట్రిబ్యునల్ అవార్డు అమల్లోకి వచ్చినప్పుడే పరిష్కారం లభించే ఆస్కారం ఉన్నదని చెప్తున్నారు. ఏపీ చేపట్టిన రాయలసీమ లిఫ్ట్‌తోపాటు, ఇతర వివాదాలు కూడా న్యాయస్థానాల్లో ఉన్నాయి. ట్రిబ్యునల్ కేటాయింపులు పూర్తయితే తప్ప తెలంగాణ లేవనెత్తిన అంశాలకు పరిష్కారం లభించబోదని ఇంజినీర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే కేఆర్ఎంబీ సైతం పలు సందర్భాల్లో తేల్చిచెప్పిందని గుర్తుచేస్తున్నారు. మరోవైపు, ట్రిబ్యునల్ వాదనలు సైతం తుది దశకు చేరుకున్నాయి. అయినప్పటికీ హడావుడిగా వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చే యడం, తెలంగాణ ప్రభు త్వం సైతం ఉత్సా హం చూపడం పై ఇంజినీర్లు, నీటిరంగ నిపుణులు అనేక అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.
ఇది కేవలం ఏపీలోని చంద్రబాబు సర్కార్ చేపట్టనున్న పోలవరం-నల్లమలసాగర్ లింకు ప్రాజెక్టుకు మార్గం సుగమం చేసేందుకు తప్ప మరొకటి కాదని అంటున్నారు. గతంలో రేవంత్‌రెడ్డి సర్కార్ వ్యవహరించిన తీరును నీటిరంగ నిపుణులు, ఇంజినీర్లు గుర్తుచేస్తున్నారు. గతంలో కేంద్ర జల్‌శక్తి శాఖ నిర్వహించిన సమావేశంలో ఏపీ ఈ ప్రాజెక్టునే ఏకైక ఎజెండాగా ముందుకుపెట్టింది. ప్రస్తుతం సైతం ఏపీ సర్కార్ నల్లమలసాగర్ లింకు ప్రాజెక్టునే తెరమీదికి తెచ్చే అవకాశం ఉన్నది. అయితే, గతంలో కేంద్ర జల్‌శక్తి శాఖ సమావేశానికే హాజరు కాబోమని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం, ఆపై మీటింగ్‌కు హాజ రై ఏకంగా కమిటీ ఏర్పాటుకు అంగీకరించిందనే విషయాన్ని గుర్తుచేస్తున్నారు.
కేంద్రం సైతం గతంలో ఎన్నడూ లేనివిధంగా కమిటీని ఏర్పాటుచేయడం కూడా ఏపీకి లబ్ధి చేకూర్చేందుకేనని అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ఏపీకి అడుగడుగునా వత్తాసు పలుకుతున్న కేంద్ర జల్‌శక్తి శాఖతో భేటీ కావడమే మహా తప్పిదమని ఇంజినీర్లు, నీటిరంగనిపుణులు వివరిస్తున్నారు. మొత్తంగా కమిటీ కేవలం ఏపీ చేపట్టిన పీఎన్లింకు ఆమోదం తీసుకునేందుకే గానీ మ రొకటి కాదనే అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఈ కీలక భేటీ నుంచి తెలంగాణ సమాజం దృష్టి మరల్చేందుకు డైవర్షన్ డ్రామాకు తెరతీశారని, కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారని అభిప్రాయపడుతున్నారు.
తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య జల వివాదాల పరిష్కారానికి 15 మంది అధికారులతో కేంద్రం ప్రత్యేక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కమిటీకి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ అనుపమ్ ప్రసాద్ నేతృత్వం వహించనుండగా, ఇరు రాష్ర్టాలు, పలు కేంద్ర సంస్థల నుంచి కీలక అధికారులు పాల్గొననున్నారు. ఈ నిపుణుల కమిటీ న్యూఢిల్లీ సేవాభవన్‌లోని సీడబ్ల్యూసీ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు భేటీ కానున్నది.
ఈ భేటీలో చర్చ కోసం నీటి నిర్వహణకు సంబంధించిన వివాదాస్పద, పరిష్కరించాల్సిన కీలక అంశాలను తక్షణం సమర్పించాలని ఇరు రాష్ర్టాలకు కేంద్రం సూచించినా, ఇప్పటికీ రెండు రాష్ర్టాలు స్పందించలేదు. ఎజెండా లేకుండానే సమావేశానికి హాజరు కావాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకున్నది. రాష్ట్రం నుంచి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ప్రభుత్వ సలహాదారు ఆదిత్యానాథ్‌దాస్, ఈఎన్సీ అమ్జద్ హుస్సేన్ హాజరుకానున్నారు. జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ చైర్లన్లతోపాటు ఏపీ అధికారులు పాల్గొననున్నారు.