వరంగల్ చౌరస్తా, మార్చి 21: వరంగల్ ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో ఫార్మాసిస్ట్ చేతివాటం ప్రదర్శించాడు. ప్రభుత్వ దవాఖానలో రోగులకు అందించాల్సిన మందులను బహిరంగ మార్కెట్లో విక్రయించాడు. టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు చేయడంతో బండారం బయటపడింది. పోలీసులు, డ్రగ్ కంట్రోలర్ తెలిపిన వివరాల ప్రకారం.. తలకోటి నరేందర్ వరంగల్ ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో ఓపీ ఫార్మాసిస్ట్‌గా సుమారు 33 ఏండ్లుగా పనిచేస్తున్నాడు. దవాఖానలో ఎక్కువ మంది ఓపీ సేవలు వినియోగించుకున్నట్టు, వారికి వైద్య పరీక్షల అనంతరం వైద్యులు సూచించిన మందులను రెండింతలు నమోదు చేసి ఉచితంగా పంపిణీ చేసినట్టు రికార్డుల్లో నమోదు చేశాడు. మిగిలిన మందులను గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్‌కు చెందిన బలరాందాసు ద్వారా బహిరంగ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకున్నాడు.
బుధవారం వరంగల్ జిల్లా డ్రగ్ కంట్రోలర్ అరవింద్ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ అధికారులు, ఇంతేజార్గంజ్ పోలీసుల సహకారంతో నిర్వహించిన దాడుల్లో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులు తలకోట నాగేందర్, బలరాం దాసులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. మందులను కాశీబుగ్గలో నిల్వ చేసి అక్రమంగా బహిరంగ మార్కెట్లో విక్రయించినట్టు తేలింది. రూ. 69,360 విలువైన 34 బాక్సుల యాంటీ బయాటిక్ టాబ్లెట్స్, రూ.11,484 విలువైన 240 కంటి చుక్కల మందు బాటిల్స్, మొత్తం సుమారు రూ.80,844 విలువైన మందులను స్వాధీనం చేసుకున్నారు.