Lagacharla | హైదరాబాద్, నవంబర్ 30(నమస్తే తెలంగాణ): వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల, పోలేపల్లి గ్రామాల పరిధిలో బహుళార్థ సాధక పారిశ్రామికవాడ ఏర్పాటుకు ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఈ మేరకు భూసేకరణ కోసం శనివారం ప్రభుత్వం నోటిఫికేషన్ను విడుదల చేసింది. లగచర్లలో 110.32 ఎకరాలు, పోలేపల్లిలో 71.39 ఎకరాల భూమిని సేకరించేందుకు జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ జారీచేశారు. భూసేకరణ, పునరుపాధి, పునరావాస కల్పన చట్టం కింద భూసేకరణ చేపట్టనున్నట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
పారిశ్రామికవాడ ఏర్పాటుకు గుర్తించిన భూములను ముందస్తు అనుమతి లేకుండా క్రయవిక్రయాలు చేయరాదని, ఆయా భూములపై రుణాలు కల్పించరాదని, ఎటువంటి లావాదేవీలు జరపరాదని నోటిఫికేషన్లో ప్రభుత్వం స్పష్టంచేసింది. భూములు కోల్పోతున్నవారు ఏమైనా సందేహాలుంటే నోటిఫికేషన్ విడుదలైన 60 రోజుల్లోగా కలెక్టర్ కార్యాలయంలో అభ్యంతరాలు దాఖలు చేయవచ్చని సూచించారు.
దుద్యాల మండలం హకీంపేట, పోలేపల్లి, లగచర్ల పరిధిలో ఫార్మా కంపెనీల ఏర్పాటుకు తొలుత ప్రభుత్వం 1358.37 ఎకరాల అసైన్డ్/పట్టా భూముల సేకరణ ప్రక్రియను రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. రైతుల ప్రతిఘటనతో గతంలో ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ను ప్రభుత్వం ఉపసంహరించుకున్నది.
తాజాగా లగచర్ల, పోలేపల్లిలో భూసేకరణకు మరో నోటిఫికేషన్ విడుదలైంది. భూ వినియోగం మారినప్పటికీ భూసేకరణ యత్నాన్ని ప్రభుత్వం వీడలేదని తేలింది. గతంలో ఫార్మా కోసం భూసేకరణ చేపట్టగా, తాజాగా పారిశ్రామికవాడ పేరుతో భూసేకరణకు ఒడిగట్టడం గమనార్హం.