Warangal | వర్ధన్నపేట, నవంబర్ 25: బస్సులో సీట్లు ఇవ్వడం లేదని దివ్యాంగులు వినూత్న నిరసన తెలిపారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని ఆర్టీసీ బస్టాండ్లో సోమవారం వారు చీరలు కట్టుకొని ఆందోళన చేశారు.
ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేశ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం దివ్యాంగులకు శాపంగా మారుతున్నదన్నారు. ఉచిత ప్రయాణంతో దివ్యాంగులకు బస్సుల్లో సీట్లు దొరకడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు తమకు సంబంధించిన సీట్లలో కూర్చోవడంతో దివ్యాంగులకు సీట్లు దొరక్క ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బస్సుల్లో దివ్యాంగులకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు మహ్మద్ షరీఫ్, రాష్ట్ర బాధ్యులు కొల్లూరి ఈదయ్య, గుడిపెల్లి సుమతి, జెట్టబోయిన శ్రీనివాస్, ఇస్లావత్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Suryapeta | మరణంలో వీడని బంధం.. ఒకేరోజు భార్యాభర్తల మృతి
Pensions | ఉమ్మడి పాలమూరు జిల్లాలో పింఛన్ కోసం రోడ్డెక్కిన వృద్ధులు
MLC Kavitha | కాంగ్రెస్ అసమర్థ పరిపాలన మరో పేదబిడ్డ ప్రాణం తీసింది : ఎమ్మెల్సీ కవిత