సంగారెడ్డి కలెక్టరేట్, డిసెంబర్ 1: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో జూన్ 30న జరిగిన పేలుడు ఘటనలో బాధితులకు ఇస్తామన్న రూ.కోటి పరిహారం ఏమైందని సంగారెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కొనింటి మాణిక్రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం వారు కలెక్టర్ పీ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్కు వేర్వేరుగా వినతిపత్రాలు అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. సిగాచి పరిశ్రమలో ఘటన జరిగి ఐదు నెలలైనా బాధిత కుటుంబాలకు పరిహారం అందలేదని దుయ్యబట్టారు.
బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం వెంట నే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆగమేఘాల మీద సీఎం రేవంత్రెడ్డి సిగాచి పేలుడు బాధితులకు రూ.కోటి పరిహారం చెల్లిస్తామని ప్రకటించి చేతులు దులుపుకొన్నారని మండిపడ్డారు. మృతి చెందిన కుటుంబాలకు కంపెనీ నుంచి రూ.25 లక్షలు, ప్రభుత్వం నుంచి రూ.లక్ష మాత్రమే అందించారని గుర్తుచేశారు. ప్రభుత్వం ఇస్తామన్న రూ. కోటి పరిహారం కోసం బాధిత కుటుంబ సభ్యులు కండ్లల్లో వత్తులు వేసుకొని చూస్తున్నారని తెలిపారు.