హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని భూదాన్ భూములు నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ ప్రైవేట్ వ్యక్తులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు జారీ అయ్యాయని పిటిషనర్ బిర్ల మల్లేశ్ హైకోర్టులో దాఖలు చేసిన రిప్లయ్ కౌంటర్లో స్పష్టం చేశారు. చట్టవిరుద్ధంగా జరిగిన ఆ లావాదేవీలు చెల్లవని పేర్కొన్నారు. ఆ భూములకు సంబంధించి రికార్డుల్లో నమోదైన విషయాలకు విరుద్ధంగా జిల్లా కలెక్టర్ తప్పుడు వివరాలతో కౌంటర్ వేశారని ఆక్షేపించారు. నాగారంలోని 181, 182, 194, 195 సర్వే నంబర్లలో భూదాన్ భూముల అన్యాక్రాంతమయ్యాయని, ఆ భూములను ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వారి కుటుంబసభ్యులు కాజేశారని పేర్కొంటూ హైకోర్టులో మల్లేశ్ వేసిన పిటిషన్పై గతంలో జస్టిస్ సీవీ భాసర్రెడ్డి విచారణ జరిపి, కలెక్టర్ సహా ప్రతివాదులకు నోటీసులు జారీచేశారు. దీంతో ఆ భూముల్లో అక్రమాలు జరగలేదని కలెక్టర్ కోర్టుకు తెలియజేశారు.
దీనిపై వేసిన రిప్లయ్ కౌంటర్లో మల్లేశ్ పలు విషయాలను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నాటి కలెక్టర్ అమోయ్ కుమార్, ఎమ్మార్వో ఆర్సీ జ్యోతి, ఆర్డీవో సిఫారసులతో అప్పటి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ చట్టవిరుద్ధంగా ఆ భూములను డీనోటిఫై చేశారని, ఆ తర్వాత ఏడుగురు ప్రైవేట్ వ్యక్తుల పేరిట పట్టాదార్ పాస్ పుస్తకాలు జారీ అయ్యాయని వివరించారు. భూదాన్ బోర్డు లేఖ ఆధారంగా 181/1, 181/2, 181/3 సర్వే నంబర్లలోని 50 ఎకరాలను భూదాన్ భూములని పేర్కొంటూ ప్రభుత్వం 2006లో మెమో ఇచ్చిందని, అయినప్పటికీ చట్టవ్యతిరేకంగా ఆ భూములను డీనోటిఫై చేశారని పేర్కొన్నారు.
ఆ తర్వాత ఎస్ హరీశ్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా వచ్చాక ఈఐపీఎల్ నిర్మాణ సంస్థతోపాటు పుట్ట రామన్న, ప్రవీణ అనే వ్యక్తుల పేరిట భూ బదలాయింపు జరిగిందని, అవే సర్వే నం బర్లలోని మరో 45 ఎకరాలను సరారీ (గైర్హాన్) భూములుగా పేరొంటూ ప్రభుత్వం 2012లో మెమో ఇచ్చిందని తెలిపారు. గతంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన నవీన్ మిట్టల్తోపాటు రంగారెడ్డి జిల్లా కలెక్టర్లుగా పనిచేసిన అమోయ్ కుమార్, హరీశ్, ఎమ్మా ర్వో మహమ్మద్ అలీఖాన్, డిప్యూటీ తహసిల్దార్ వీ నవత రికార్డులను తారుమారు చేశారని, భూదాన్ భూములను ప్రైవేట్ భూములుగా డీనోటిఫై చేసి, పట్టా భూములుగా మార్చడం ద్వారా వాటికి అక్రమ వారసులను ఆమోదించారని తెలిపారు.
భూదాన్ బోర్డుకు దానం చేసిన భూములను డీనోటిఫై చేసేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా, భూదాన్ యజ్ఞ బోర్డు అధికారిగా నవీన్ మిట్టల్ విచారణను తప్పుదారి పట్టించి భూదాన్ భూములు ఉన్నతాధికారుల వశమయ్యేందుకు దోహదపడ్డారని పేర్కొన్నారు. సర్వే నంబర్ 194లోని 26.30 ఎకరాలతోపాటు సర్వే నంబర్ 191లోని 95 ఎకరాలను డీనోటిఫై చేయాలంటూ 2019లో నాటి కలెక్టర్ అధికారిక లేఖ రాశారని, దీన్ని బట్టి 2019 వరకు ఆ భూములు నిషేధిత జాబితాలో ఉన్నట్టు స్పష్టమవుతున్నదని తెలిపారు. ఈ లేఖకు ముందు 2018 ఏప్రిల్ 23న సర్వే నంబర్ 195లో మహమ్మద్ నున్వర్ఖాన్ అనే ప్రైవేట్ వ్యక్తి తప్పుడు పట్టాదార్ పాస్ పుస్తకాలు పొంది, ఆ భూములను కొనుగోలు చేశారని వివరించారు. ఈ విషయాలను ప్రస్తావించకుండా కలెక్టర్ కౌంటర్ వేశారని కౌంటర్లో పేర్కొన్నారు.