హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ) : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర వద్ద గోదావరి నదిలో ఆదివారం జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన ఘటనపై న్యాయవాది ఇమ్మానేని రామారావు జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ)లో పిటీషన్ దాఖలు చేశారు. బాసరలో నిర్వహణ లోపం, అడుగడుగునా నిర్లక్ష్యం కారణంగా ఐదు నిండు ప్రాణాలు బలైనట్టు ఆయన తన పిటిషనలో పేర్కొన్నారు.
పుషరఘాట్లలో సూచిక బోర్డులు లేవని, గజ ఈతగాళ్ల జాడే లేదని, లైవ్ జాకెట్లు మచ్చుకైనా కనిపించలేదని, అధికారులు, సిబ్బంది భక్తులను పట్టించుకున్న పాపాన పోవడంలేదని ఆయన ఆరోపించారు. నది లోపలికి వెళ్లకుండా ఉండేందుకు ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టలేదని, కనీసం కంచె ఏర్పాటుచేయలేదని పేర్కొన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకునేలా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయాలని, మృతులకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. పిటిషన్ స్వీకరించిన కమిషన్ ఘటనపై కేసు నమోదు చేసింది.