హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మేడ్చల్ మలాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవాపూర్ గ్రామానికి చెందిన బుట్టెంగారి మాధవరెడ్డి, సిద్దిపేట జిల్లా చిన్నకోడూరుకు చెందిన జలపల్లి మల్లవ్వ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని బుధవారం న్యాయమూర్తి జస్టిస్ కే లక్ష్మణ్ విచారణ చేయనున్నారు. స్థానిక సంస్థలకు నిర్వహించబోయే ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకమని పిటిషనర్లు పేరొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులను వెలువరించే ప్రయత్నాల్లో ఉన్నదని తెలిపారు. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285ఏ ప్రకారం రాష్ట్రప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసి ఇప్పుడున్న విధంగానే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఆ సెక్షన్ను తొలగించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని శాసనసభ తీర్మానం చేయడం చెల్లదని ప్రకటించాలని కోరారు. ఈ మేరకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నదని తెలిపారు. ఈ కేసులో ప్రతివాదులుగా ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ, సాధారణ పరిపాలన శాఖల ముఖ్యకార్యదర్శులు, రాష్ట్ర ఎన్నికల సంఘం, మేడ్చల్ మలాజిగిరి, సిద్దిపేట కలెక్టర్లను పేరొన్నారు.
పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరగాలి
‘పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285ఏలో పేరొన్న రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలి. ప్రస్తుతం బీసీలకు 28 శాతం, ఎస్సీలకు 15, ఎస్టీలకు 9 శాతం రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. ఇదే విషయాన్ని పంచాయతీరాజ్ చట్టం కూడా స్పష్టం చేస్తున్నది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు 50 శాతం వరకే రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. అయితే, బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచడం వల్ల మొత్తం రిజర్వేషన్లు 68 శాతానికి పెరుగుతాయి. అది సుప్రీంకోర్టు తీర్పుకు, రాజ్యాంగానికి వ్యతిరేకం అవుతుంది. కే కృష్ణమూర్తి వర్సెస్ కేంద్రం కేసులో ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదు. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285ఏ తొలగింపునకు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు అసెంబ్లీ తీర్మానం చేసింది.
ఈ తీర్మానానికి గవర్నర్/రాష్ట్రపతి ఆమోదం ఇంకా లభించలేదు. రాజ్యాంగంలోని 9వ షెడ్యూలు కింద 42 శాతం రిజర్వేషన్లను ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయం కీలకం కానుంది. ఇలా చేస్తే న్యాయ సమీక్ష నుంచి మినహాయింపునకు వీలుంటుందో లేదో తేల్చాలి. ఈ విధంగానే తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణలో కూడా అమలు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రప్రభుత్వం ఉన్నది. తమిళనాడు కల్పించిన రిజర్వేషన్ల వివాదం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. రిజర్వేషన్లను పెంచుతూ బీహార్ రాష్ట్రం తీసుకువచ్చిన విధానాన్ని న్యాయస్థానం కొట్టేసింది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ సరార్ చేసే ప్రయత్నాలు కూడా చెల్లుబాటు కావు. కాబట్టి పాత విధానంలోని రిజర్వేషన్లకు అనుగుణంగానే ఎన్నికలు నిర్వహించేలా ఉత్తర్వులు ఇవ్వాలి’ అని పిటిషనర్లు హైకోర్టును కోరారు.