హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): దేశానికి అవసరమైన బొగ్గు ఉత్పత్తిలో కీలకభూమిక పోషిస్తున్న సింగరేణి బలోపేతానికి సహకరించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర కేంద్రానికి విజ్ఞప్తిచేశారు. రాజ్యసభ జీరో అవర్‌లో గురువారం ఆయన సింగరేణికి సంబంధించిన అత్యవసర అంశాలను ప్రస్తావించా రు. కోల్‌బెల్ట్‌లో వేలాది కుటుంబాలకు సింగరేణి జీవనాధారమని గుర్తుచేశారు. వానలు, వరదల కారణంగా బొగ్గు ఉత్పత్తి, తరలింపు మందగించడంతో విద్యుత్తు తయారీకి అంతరాయం ఏర్పడటంతో 2025-26 ఆర్థిక సంవత్సర లక్ష్యమైన 72 మిలియన్ మెట్రిక్ టన్నులు సాకారమయ్యే పరిస్థితి కనిపించడం లేదని చెప్పారు.
ఈ పరిస్థితుల్లో ఆర్థిక సహకారం అందించాల్సిన బాధ్యత మోదీ సర్కారుపై ఉన్నదని స్పష్టంచేశారు. పెండింగ్‌లో ఉన్న కొత్తగూడెం వీకేసీ, జవహర్‌నగర్ ఓపెన్‌కాస్ట్, గుండాల-ఇల్లందు ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని కోరారు. సింగరేణిలో కేంద్రానికి ఉన్న 49శాతం వాటాను ఉపసంహరించుకుంటుందని కార్మికులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. వారి సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉన్నదని అన్నారు. సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు కోల్ ఇండియాతో సమానంగా ప్రోత్సాహకాలు అందించాలని విన్నవించారు. సింగరేణిలోని సమస్యలు పరిష్కరించి, ఉత్పత్తి పెంపునకు తక్షణ చర్యలు చేపట్టాల్సిన బాధ్యత కేంద్రలోని బీజేపీ సర్కారుపై ఉన్నదని పేర్కొన్నారు.