హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): జనగామ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అనుమతి ఇచ్చింది. తద్వారా ఈ ఏడాది రాష్ట్రంలో గుర్తింపు పొందిన ఐదో ప్రభుత్వ మెడికల్ కాలేజీగా నిలిచింది. మొత్తం 100 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ సందర్భంగా ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తంచేశారు. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 12 మెడికల్ కాలేజీలు ఏర్పాటుచేశారు. గత ఏడాది ఒకేసారి 8 కాలేజీలు ప్రారంభించి రికార్డు సృష్టించారు. ఈ ఏడాది మరో 9 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఆసిఫాబాద్, కామారెడ్డి, ఖమ్మం, వికారాబాద్ కాలేజీలకు ఇప్పటికే ఎన్ఎంసీ అనుమతి లభించింది. మరో నాలుగు కాలేజీల అనుమతులు తుది దశలో ఉన్నాయి.