Telangana Secretariat | హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): సచివాలయం ఆంక్షల వలయంలోకి వెళ్లిపోయింది. తమది ప్రజాప్రభుత్వమని, సచివాలయంలోకి ప్రజలు ఎప్పుడైనా రావచ్చ ని, ఆంక్షలుండవని స్వయంగా సీఎం రేవంత్ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన నాడు గొప్పగా చెప్పారు. ప్రజలు, మీడియా నిరభ్యంతరంగా రావచ్చని నొక్కివక్కాణించారు. కాంగ్రెస్ అనుకూల మీడియా, సోషల్ మీడియా ఈ విషయానికి ప్రాధాన్యమిచ్చా యి. కానీ, కొన్ని నెలలుగా సచివాలయానికి సామాన్యులు కాదు కదా.. మీడియా ప్రతినిధులు కూడా అనుమతి లేనిదే వెళ్లలేని పరిస్థితి నెలకొన్నది. బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు విజిటర్స్ పేరుతో పాసు ఇచ్చేవారు. ఒక పాసుపై ఎంత మంది అయినా అభ్యంతరం చెప్పేవారు కాదు. కానీ, రేవంత్ సీఎం అయ్యా క పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సచివాలయానికి సందర్శకులను మధ్యాహ్నం 3-5 గంటల వరకే అనుమతిస్తున్నారు. అది కూడా ఒక పాసుపై ఒక్కరు లేదా అతికష్టంపై ఇద్దరు మాత్రమే. అందుకు కూడా నిర్దేశిత సమయాన్ని ఇస్తున్నారు.
ఆరో అంతస్థుకు అనుమతి నిరాకరణ
సచివాలయంలో సీఎం, సీఎస్ ఉండే ఆరో అంతస్థులోకి సందర్శకులు, మీడియాను అనుమతించడం లేదు. కేసీఆర్ సీఎంగా ఉన్నపుడు ఆరో ఫ్లోర్ వరకు ఎవ్వరైనా వెళ్లే పరిస్థితి ఉండే ది. సీఎంను చూడాలనుకునేవారు, సీఎం వెళ్లేదారిలో కలిసి వినతిపత్రాలు ఇచ్చేవారు కనిపించేవారు. సీఎస్‌ను కలిసేవారిని కూడా పేషీ వద్ద నిలబడేందుకు అనుమతి ఇచ్చేవారు. కానీ, ఇప్పుడు సీఎస్ పేషీకీ ఎవ్వరినీ రానివ్వడం లేదు. ఆరో ఫ్లోర్‌కు వెళ్లేందుకు అన్ని లిఫ్టుల్లోనూ నిషేధం విధించారు. అక్కడికి వెళ్లాలంటే ఆ ఫ్లోర్‌లోని అధికారి ఎవరైనా తప్పనిసరిగా లిఫ్టు వద్ద ఉండే పోలీసు వారికి సమాచారం ఇవ్వాల్సిందే. ప్రత్యేక పోలీసు దళాలను అక్కడ ఏర్పాటు చేశారు. ఒక్క లిఫ్టు దగ్గరే కాదు.. ఆరో ఫ్లోర్‌లోకి వెళ్లే మెట్ల మార్గంపై కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్యేలూ ఫోన్లు ఇవ్వాల్సిందే
రెండో ఫ్లోర్‌లోని ఆర్థిక శాఖ మంత్రి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చాంబర్‌కు వెళ్లేందుకు మరింత కఠిన నిబంధనలు విధించారు. ఎవరైనా భట్టిని కలవాలంటే కచ్చితంగా ముందస్తు అనుమతి ఉండాల్సిందే. అనుమతి ఉన్నవారు కూడా వెళ్లే ముందు సెల్ఫోన్లను బయటే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఎమ్మెల్యేలు వెళ్లాలన్నా ఫోన్లు డిపాజిట్ చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఫోన్లు ఇవ్వకపోతే అనుమతి నిరాకరిస్తున్నారు. ఫోన్లతో లోపల జరిగే ప్రతీ సంభాషణను రికార్డు చేస్తున్నారన్న కారణంగానే ఈ విధానాన్ని తెచ్చినట్టు మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఇక ఇటీవల కొంతమంది కాంట్రాక్టర్లు తమ పెండింగ్ బిల్లుల కోసం భట్టి విక్రమార్క చాంబర్ ముందు ధర్నా చేసిన విషయం తెలిసిందే. కాంట్రాక్టర్ల ధర్నా తర్వాత సందర్శకుల విషయంలో పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు.
మంత్రుల నివాస ప్రాంగణంలోనూ..
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సచివాలయంతోపాటు మంత్రుల నివాస సముదాయానికి కూడా సామాన్యులు వెళ్లే అవకాశం ఉండేది. ఇప్పుడు మంత్రుల నివాస ప్రాంగణానికి వెళ్లాలన్నా అనుమతి ఉండాల్సిందే. అనుమతి ఉన్నప్పటికీ ఒక మంత్రి తర్వాత మరో మంత్రిని కలుస్తామంటే కుదరదని పోలీసులు స్పష్టంగా చెప్తున్నారు. గతంలో ఈ తరహా విధానం లేదు కదా అంటే.. ఇప్పుడు ప్రభుత్వం కొత్త నిబంధనలు పెట్టిందంటూ పోలీసులు తమ నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు.