హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో నాలాల సమగ్ర అభివృద్ధి చేపట్టడం వల్ల వరదముంపు సమస్య శాశ్వతంగా పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధి మినిస్టర్ రోడ్ లోని పికెట్ నాలా పై ఎస్ఎన్డీపీ కార్యక్రమం క్రింద చేపట్టిన వంతెన పునర్నిర్మాణ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఎన్నో సంవత్సరాల క్రితం నిర్మించిన నాలాల నిర్వహణ సక్రమంగా లేకపోవడం, నాలాలు ఆక్రమణలకు గురికావడంతో వర్షాకాలంలో పలు కాలనీలు వరద ముంపునకు గురవుతున్నాయని చెప్పారు. పికెట్ నాలా వంతెన కూడా ప్రస్తుతం నీటి వరద ప్రవాహానికి అనుగుణంగా లేకపోవడం వలన వరద ముంపు సమస్య ఏర్పడుతుందని అన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసమే ఎస్ఎన్డీపీ కార్యక్రమం క్రింద రూ. 20 కోట్లతో వంతెన పునర్నిర్మాణ పనులు, కళాసీగూడ నాలా విస్తరణ పనులను చేపట్టినట్లు వివరించారు.
పునర్నిర్మాణ పనులలో భాగంగా గతంలో 12 మీటర్లు ఉన్న వంతెనను 22 మీటర్ల వెడల్పు తో నిర్మిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా 20 మీటర్ల వెడల్పుతో ఉన్న రోడ్డును 30 మీటర్లకు విస్తరిస్తున్నట్లు తెలిపారు. వంతెన నిర్మాణం పూర్తయితే కంటోన్మెంట్, రసూల్ పురా బస్తీ, అన్నానగర్, బీహెచ్ఈఎల్కాలనీ, ఇక్రిశాట్ తదితర కాలనీల ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. మంత్రి వెంట ఎస్ఎన్డీపీ సీఈ కిషన్, వాటర్ వర్క్స్ డైరెక్టర్ కృష్ణ, ఎస్ఈ భాస్కర్ రెడ్డి, కార్పొరేటర్ మహేశ్వరి, మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.