హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): భవిష్యత్తులో భారీ వర్షాలు, వరదలు, ఇతర విపత్తులను మరింత సమర్థంగా ఎదుర్కోవడంతోపాటు వాటి ప్రభావ తీవ్రతను తగ్గించేందుకు జిల్లాలవారీగా శాశ్వత ప్రణాళికలను రూపొందించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. 2024-30 మధ్యకాలానికి సంబంధించిన ఈ ప్రణాళికలను వచ్చే ఏడాది మార్చి నాటికి సిద్ధం చేయాలని అధికారులకు స్పష్టం చేసినట్టు హైకోర్టుకు తెలిపింది. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌కు పరికరాల కొనేం దుకు నిధులను కేటాయిస్తామని పేర్కొన్నది. ఇటీవల సంభవించిన వరదల నేపథ్యంలో దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం మంగళవారం విచారణ జరపడంతో ప్రభుత్వం ఈ వివరణ ఇచ్చింది. తెలంగాణలో గత 19 నుంచి 28 వరకు కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల 41 మంది మరణించడంతోపాటు 813 పశువులు మృత్యువాతపడినట్టు రాష్ట్ర రెవెన్యూ కార్యదర్శి (విపత్తుల నివారణ విభాగం) రాహుల్ బొజ్జా హైకోర్టుకు నివేదించారు.
ఎన్డీఆర్ఎఫ్, ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ సాయంతో 81 గ్రామాల నుంచి 8,196 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, రాష్ట్రవ్యాప్తంగా 162 కేంద్రాల్లో 14,216 మంది వరద బాధితులకు పునరావాసం కల్పించి ఆహారంతోపాటు తాగునీరు, మం దులు అందజేసినట్టు అఫిడవిట్లో పేర్కొన్నారు. భారీ వర్షాలు, వరదల వల్ల 240 గృహాలు పూర్తిగా, 6,443 గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయని, 1,59,960 ఎకరాల్లో పంటలు దెబ్బతినడంతో 57,688 మంది రైతులకు నష్టం వాటిల్లిందని వివరించారు. 190 సాగునీటి చెరువులకు గండ్లు పడ్డాయని, జిల్లాల్లో 168 రోడ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. వరదల నేపథ్యంలో అంటువ్యాధులు వ్యాపించకుండా వైద్యారోగ్య శాఖ పటిష్ఠ చర్యలు చేపడుతున్నదని నివేదించారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ.. విపత్తులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం శాశ్వత చర్యలు తీసుకోవడాన్ని సరైన చర్యగా పేర్కొన్నది. తదుపరి విచారణను ఈ నెల 4కు వాయిదా వేసింది.