వీధి కుక్కల దాడులను నిరోధించేందుకు శాశ్వత చర్యలు చేపట్టాల్సిందే: హైకోర్టు
హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): వీధి కుకల దాడుల్లో గాయపడిన, మరణించిన బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారాన్ని చెల్లించి చేతులు దులిపేసుకుంటే కుదరదని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు శాశ్వత చర్యలు చేపట్టాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది.
అనుపమ్ త్రిపాఠి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాల్సిందేనని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్ కుమార్ ధర్మాసనం తేల్చిచెప్పింది. ప్రజలపై వీధి కుక్కల దాడులను నిరోధించేందుకు చేపట్టిన చర్యలతోపాటు సుప్రీంకోర్టు తీర్పును ఏ మేరకు అమలు చేస్తారన్న దానిపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 7కు వాయిదా వేసింది.