హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నూతన విద్యావిధానం-2020(ఎన్ఈపీ)ని అమలుచేయాలని, ఎన్సీఈఆర్టీ సిలబస్‌ను ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) ప్రభుత్వాన్ని కోరింది. సోమవారం సచివాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశాన్ని కలిసి రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి నవాత్ సురేశ్ వినతిపత్రాన్ని సమర్పించారు. ఉపాధ్యాయుల సర్దుబాటును ఒక్కో జిల్లాల్లో ఒక్కో విధంగా అమలుచేస్తున్నారని, తొలుత మండలం, ఆ తర్వాత జిల్లా స్థాయిలో సర్దుబాటు చేయాలని కోరారు. బదిలీ అయ్యి రిలీవ్‌కాని టీచర్లను సర్దుబాటులోపే రిలీవ్చేయాలని కోరారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 23(నమస్తే తెలంగాణ): కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణలో మిగిలిపోయిన 466 మంది డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్లను సైతం క్రమబద్ధీకరించాలని అధ్యాపకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దీనిపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ అంశంపై డిప్యూటీ సీఎం సహా ప్రభుత్వ పెద్దలను కలిసినా ప్రయోజనం లేదని వాపోయారు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం రాష్ట్ర నాయకులు వైకుంఠం, బైరయ్య, శ్రీనివాసులు, రామకృష్ణ తదితరులు కోరారు.