Samagra Kutumba Survey | హైదరాబాద్, నవంబర్11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి సర్వేను నిర్వహిస్తున్న తీరు తమ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే విధంగా ఉన్నదని ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఐచ్ఛికం అని చెప్తూనే ఎన్యూమరేటర్లు దబాయించి వివరాలు సేకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగం, చట్టాలు, సుప్రీంకోర్టు తీర్పులను సైతం తుంగలో తొక్కుతున్నాదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సేకరించిన సమాచారం గోప్యంగా ఉంటుందనే భరోసా లేకుండా పోయిందని అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
ఆధార్ కార్డు అమలును సవాల్ చేస్తూ 2017లో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కేఎస్ పుట్టస్వామి నడిపిన కేసులో గోప్యతను ప్రాథమిక హకుగా ప్రకటిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. సుప్రీంతీర్పుకు విరుద్ధంగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వే కొనసాగుతున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ప్రజల వ్యక్తిగత గోప్యతను భంగపరుస్తున్నదని మేధావి వర్గం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. వ్యక్తిగత ఆస్తులు, ఆదాయ సమాచారాన్ని సేకరిస్తున్నదని అసహనం వ్యక్తంచేస్తున్నారు. సర్వేలో మొత్తంగా 75 ప్రశ్నలతో ప్రశ్నావళిని రూపొందించి సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, కుల, రాజకీయాలకు సంబంధించిన వివిధ అంశాల్లో సమాచారాన్ని ప్రస్తుతం సేకరిస్తున్న సంగతి తెలిసిందే. కుటుంబ యాజమానితోపాటు సభ్యుల వివరాలు, ఆధార్ నంబర్లను కూడా ప్రభుత్వం సేకరిస్తున్నది.
ప్రభుత్వం సర్వే ఫారమ్‌లో ఐచ్ఛికం (చెప్పవచ్చు/చెప్పకపోవచ్చు) అని స్పష్టంగా తెలియజేసినా క్షేత్రస్థాయి ఎన్యూమరేటర్లు మాత్రం అందుకు విరుద్ధంగా బలవంతంగా అడిగి తీసుకుంటున్నారని ప్రజలు మండిపడుతున్నారు. పార్టు-2లోని ప్రశ్నలపై క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకతతోపాటు అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.
ఇందులో కుటుంబ స్థాయికి సంబంధించిన మొత్తం 17 ప్రశ్నలు ఉండగా, వాటిలో ముఖ్యంగా భూమి వివరాలు సేకరించే క్రమంలో ధరణిలో నమోదైన పట్టా నంబర్, భూముల రకాలు (మెట్ట, తరి, పడావు), సాగు విస్తీర్ణం, నీటి వనరు, కౌలుభూమి, సాగు వంటి సమాచారంతోపాటు ఉపాధి, వార్షిక ఆదాయం, వ్యాపారులైతే వార్షిక టర్నోవర్, బ్యాంకు ఖాతా వివరాలు, అప్పులు, ఇతర ఆస్తులకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారు. అందుకు సంబంధించిన పత్రాలను కూడా చూపాలని ప్రజలను ఎన్యూమరేటర్లు కోరుతున్నారు. దీనిపై ప్రజల్లో తీవ్ర అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడమేమిటని? ప్రశ్నిస్తున్నారు. రిజర్వేషన్ల పెంపు కోసమైతే ఆదాయ వివరాలు, ఆధార్ లెక్కలు ఎందుకని నిలదీస్తున్నారు.
ఇప్పటికే నిత్యం అనేక సైబర్ మోసాలు వెలుగుచూస్తున్న నేపథ్యంలో తాజా సర్వేపై ప్రజల్లో ఆందోళన నెలకొన్నది. గోప్యతకు సంబంధించి సేకరిస్తున్న సమాచారం భద్రంగా ఉంటుందా? అనే అనుమానం పీడిస్తున్నది. తమ వ్యక్తిగత వివరాలను అడిగేందుకు ప్రభుత్వానికి హక్కేమున్నదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. గతంలో ప్రజాపాలన పేరిట గ్యారెంటీల అమలు కోసం స్వీకరించిన దరఖాస్తులు హైదరాబాద్ బాలానగర్‌తోపాటు అనేకచోట్ల రోడ్లపైనే ప్రత్యక్షమయ్యాయని, ఇప్పుడు కూడా సర్వే ఫారాలు బయటకు వెళ్లవనే గ్యారెంటీ ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ప్రస్తుతం ఆధార్, ఫోన్ నంబర్లు మాత్రమే కాకుండా, బ్యాంకు ఖాతాలు, ఆస్తులకు సంబంధించిన వివరాలను కూడా సేకరిస్తున్నారని, ఆయా వివరాలు సైబర్ మోసగాళ్ల చేతికి చిక్కితే తమ పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మేధావివర్గం, విద్యావేత్తలు ఆయా వివరాలను ఇచ్చేందుకు విముఖత చూపుతున్నారు. కానీ ఎన్యూమరేటర్లు బలవంతంగా వివరాలు, లేదంటే పథకాలు రాబోవంటూ బెదిరింపులకు దిగుతున్నారని గ్రామీణులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.