గతంలో మేం చాలా తకువ సీట్లు గెలిచాం. కానీ ప్రజలు మా వెంటే నిలిచారు. వారి మద్దతుతోనే నేడు యూపీలో బీజేపీని రెండో స్థానానికి నెట్టి, 37మంది ఎంపీలతో లోక్‌సభలో బలంగా ఉన్నాం. ప్రజలు ఎప్పుడు ఎవరికి అండగా నిలబడతారో ఎవరూ ఊహించలేరు. ప్రజల వెంట ఉంటే వారే మనకు అవకాశాన్ని ఇస్తారు. కచ్చితంగా తెలంగాణలోనూ ప్రజల ఆలోచనలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాం
– అఖిలేశ్ యాదవ్
హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రజలు తిరిగి కేసీఆర్ పాలనకు పట్టం కడతారనే నమ్మకం తనకు ఉన్నదని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అఖిలేశ్‌యాదవ్ చెప్పారు. రాజకీయాల్లో ఎత్తుపల్లాలు సహజమని, తెలంగాణలో రాజకీయ పరిస్థితులు త్వరలో మారుతాయన్నారు. ప్రజల పక్షాన నిలబడి పోరాడితే, తప్పకుండా అండగా ఉంటారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసినప్పుడు దగ్గరి వ్యక్తిని, సొంత మనిషిని, ఆత్మీయుడిని కలిసిన అనుభూతి కలుగుతుందని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్ తమకు స్నేహితులని, తాము ఎల్లప్పుడూ వారితో కలిసే ఉంటామని తెలిపారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన అఖిలేశ్ యాదవ్ శుక్రవారం సాయంత్రం నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్లారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మహమూద్ అలీ తదితరులు పుష్పగుచ్ఛమిచ్చి, శాలువాతో సతరించి అఖిలేశ్‌కు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం కేటీఆర్, హరీశ్‌రావు శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు బహూకరించారు. ఆ తర్వాత సుమారు గంటపాటు నేతలంతా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దేశంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి చర్చించారు. సమావేశానంతరం అఖిలేశ్, కేటీఆర్ సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు.
రాజకీయాల్లో జయాపజయాలు సహజమని అఖిలేశ్‌యాదవ్ అభిప్రాయపడ్డారు. ఒకోసారి ప్రజలు మన పనితీరు, విధానాలను పునః సమీక్షించుకునే అవకాశాన్ని ఓటమి ద్వారా కల్పిస్తారని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో తమ పార్టీ ప్రస్థానాన్ని ఉదహరించారు. ‘గతంలో మేం కూడా చాలా తకువ సీట్లు గెలిచాం. కానీ ప్రజలు మా వెంటే నిలిచారు. వారి మద్దతుతోనే నేడు యూపీలో బీజేపీని రెండో స్థానానికి నెట్టి, 37మంది ఎంపీలతో లోక్‌సభలో బలంగా ఉన్నాం. ప్రజలు ఎప్పుడు ఎవరికి అండగా నిలబడతారో ఎవరూ ఊహించలేరు. ప్రజల వెంట ఉంటే వారే మనకు అవకాశాన్ని ఇస్తారు. కచ్చితంగా తెలంగాణలోనూ ప్రజల ఆలోచనలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం విభజన రాజకీయాలు నడుస్తున్నాయని, వాటికి స్వస్తి పలకాల్సిన అవసరం ఉన్నదని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో ప్రతికూలత పోవాలని, అభివృద్ధి, సానుకూల దృక్పథంతో కూడిన ప్రగతిశీల రాజకీయాలు రావాలని ఆకాంక్షించారు. ఇదే తమ విజన్ అని చెప్పారు.
సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌యాదవ్ పనితీరు తమకు ఆదర్శమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అధికారం కోల్పోయినా, పార్లమెంటు ఎన్నికల్లో అద్భుత విజయం సాధించి దేశంలోనే మూడవ అతిపెద్ద పార్టీగా ఎస్పీని నిలబెట్టారని అఖిలేశ్‌యాదవ్‌ను ప్రశంసించారు. అదే స్ఫూర్తితో బీఆర్ఎస్ కూడా బౌన్స్‌బ్యాక్ అవుతుందని, మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అఖిలేశ్‌తో వివిధ అంశాలపైన చర్చించినట్టు చెప్పారు. అఖిలేశ్‌యాదవ్ మరోసారి హైదరాబాద్ వచ్చినప్పుడు కేసీఆర్‌తో సమావేశం అవుతారని తెలిపారు.
ఈ రోజు తనతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు అందరితో చర్చించి తమ పార్టీ ఆతిథ్యం స్వీకరించినందుకు అఖిలేశ్ యాదవ్‌కు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్‌కుమార్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, మాధవరం కృష్ణారావు, బండారి లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖరరెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిశోర్‌గౌడ్, పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్‌యాదవ్, నాయకులు కురవ విజయ్ తదితరులు పాల్గొన్నారు.