ఖలీల్‌వాడి, అక్టోబర్ 27: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటిపై పోలీసులు దౌర్జన్యం చేయడాన్ని ఆ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష పార్టీ నేత ఇంటిపై పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని, ఎక్కడ ఏదో జరిగితే అది కేటీఆర్‌కు ఏం సంబంధమని ప్రశ్నించారు. కారణం లేకుండా, వారెంట్ లేకుండా సోదాలు ఎలా చేస్తారని నిలదీశారు. రేవంత్ సోదరులపై చాలా ఆరోపణలు వస్తున్నాయని, వారి ఇండ్లపై పోలీసులు రైడ్ చేసే దమ్ముందా? అని ప్రశ్నించారు. చిల్లర దాడులు తమను భయపెట్టవని, తమకు అరెస్టులు కొత్తకాదని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యం, ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి దాడులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.