కోదాడ, మే 30: సూర్యాపేట జిల్లా కోదాడ, కట్టకమ్ముల గూడెం గ్రామాల మధ్య కోదాడ శివారులో బైపాస్ రోడ్డుపై ఫ్లైఓవర్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ పది గ్రామాల ప్రజలు, వివిధ సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. బాబూనగర్ రామాపురం, నరసింహాపురం, కట్టకొమ్ములగూడెం, ఆర్లగూడెం, రామచంద్రనగర్, కొండాపురం, ఉత్తమ్ పద్మావతి కాలనీ తదితర గ్రామాల ప్రజలు శుక్రవారం వందలాదిగా బైపాస్ రోడ్డుపైకి చేరుకొని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు మాట్లాడుతూ.. 65వ నంబర్ జాతీయ రహదారి మీదుగా నిత్యం వందలాది మంది ప్రజలు ఆయా గ్రామాల నుంచి కోదాడకు విద్యా వైద్యం, ఉపాధి కోసం వచ్చి వెళ్తుతుంటారని, రోడ్డు దాటేటప్పుడు వేగంగా వచ్చే వాహనాలు ఢీకొనడంతో అనేకమంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని ఆందోళన వ్యక్తంచేశారు.
ఇంటి నుంచి బయలుదేరిన వ్యక్తి ఈ రహదారి దాటి ఇంటికి వచ్చే వరకు గ్యారెంటీ లేదని కన్నీటి పర్యంతమయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రోడ్డు దాటాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి చొరవచూపి బైపాస్ రోడ్డుపై ఫ్లైఓవర్ నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. వందలాది మంది రోడ్డుపై బైఠాయించడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. విషయం తెలుసుకున్న సీఐ శివశంకర్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులతో మాట్లాడి ధర్నా విరమింపజేశారు.